న్యూఢిల్లీ: ‘మీ వల్ల కరోనా వస్తుంది, బయటకు ఎందుకు వచ్చారు’ అంటూ ఇద్దరు లేడీ డాక్టర్లను దూషించి, వారిపై దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. సఫ్దర్ జంగ్ హాస్పిటల్ లో పని చేసే ఇద్దరు లేడీ డాక్టర్లు ఢిల్లీలోని గౌతమ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. గ్రోసరీస్ కోసం సమీపంలోని మార్కెట్ కు వెళ్లారు. ఒక వ్యక్తి వారిని ఆపి ఇంట్లోనే ఉండాలని, బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. డాక్టర్లమని చెప్పడంతో.. మీ వల్లే కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని దూషించి దాడికి పాల్పడ్డాడు. డాక్టర్లు పోలీసులకు ఫోన్ చేయగా, వారు వచ్చేసరికి నిందితుడు ఎస్కేప్ అయ్యాడు. అతడి వివరాలు చెప్పేందుకు మార్కెట్ లో ఉన్న స్థానికులు నిరాకరించారు. దాడికి పాల్పడిన నిందితుడు 42 ఏళ్ల వ్యక్తి అని, ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, అతడిని అరెస్టు చేశారు. డాక్టర్లను దూషించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో సదర్ బజార్, బెంగాల్ మార్కెట్ తోపాటు 20 హాట్ స్పాట్లను గుర్తించి సీల్ చేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవాళ్లకు మాస్కులు తప్పనిసరి చేశారు.
