బడ్జెట్​లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలి.. ఆర్. కృష్ణయ్య డిమాండ్

బడ్జెట్​లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలి.. ఆర్. కృష్ణయ్య డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. తద్వారా వారి ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాల మాదిరిగా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ స్కీములను దేశమంతటా అమలు చేయాలన్నారు. మంగళవారం కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు  ఢిల్లీలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలేను కలిసి వినతి పత్రం అందజేశారు.

అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు కేవలం రూ. 1400 కోట్లు కేటాయించడమేంటని ప్రశ్నించారు. 56 శాతమున్న బీసీలకు ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయని నిలదీశారు. మండల్ కమిషన్ బీసీల అభివృద్ధికి  చేసిన 40 సిఫార్సులను కూడా  కేంద్రం అమలు చేయలేదని ఫైర్ అయ్యారు.  బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో కల్పించిన 27 శాతం రిజర్వేషన్లకు అనుబంధంగా ఆర్థికపరమైన రాయితీలు  కేటాయించడం లేదన్నారు. ప్రత్యేక హాస్టళ్లు,  విద్యా సంస్థలు లేకపోతే బీసీలు ఎలా చదువుకుంటారని నిలదీశారు. కులవృత్తులు, చేతివృత్తులు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలి చావులకు గురవుతున్న వర్గాల్లోని  ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కృష్ణయ్య కోరారు.