రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్

రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్

సికింద్రాబాద్, వెలుగు:  ఈజీగా డబ్బు సంపాదించేందుకు గంజాయి తరలిస్తుండగా ఇద్దరు మహిళలను వరంగల్​ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద సుమారు 203 కిలోల 97 గంజాయి పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోగా, దాని విలువ రూ.50.85లక్షలు ఉంటుంది.  రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం.. గురువారం నవజీవన్​ఎక్స్​ప్రెస్​వెళ్తుండగా మహబూబాబాద్ లో వరంగల్ రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. జనరల్​బోగీలో ఇద్దరు మహిళల సీట్ల కింద ప్లాస్టిక్​బ్యాగులు కనిపించగా చెక్ చేశారు. వాటిని విప్పి చూడగా 97 ప్యాకెట్లలో గంజాయి పొడి దొరికింది. మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా మహారాష్ట్రలోని జల్​గావ్​జిల్లా యావల్​కు చెందిన చందాబాయి భీమా బెల్డర్​(62),  ఉషా దిలీప్​చౌహాన్​(43)గా చెప్పారు. 

 వైజాగ్ కు చెందిన రామ్​నాథ్​అనే వ్యక్తి పరిచయమై.. విజయవాడ నుంచి జల్​గావ్​కు గంజాయి తరలిస్తే రూ.10వేల చొప్పున ఇస్తామని చెప్పగా తీసుకెళ్తున్నామని చెప్పారు. విజయవాడలో ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చి నవజీవన్​ఎక్స్​ప్రెస్​టికెట్లు కొని ఎక్కించాడని, సీట్ల కింద ప్లాస్టిక్​బ్యాగుల్లో గంజాయి ఉందని చెప్పి వెళ్లిపోయాడని మహిళలు రైల్వే పోలీసులకు చెప్పారు. ఈ తనిఖీల్లో వరంగల్​ఆర్పీఎఫ్​, జీఆర్పీ పోలీసులు షేక్​ సుభాని, రాజు,ఎం. గురువయ్య, లలిత, పి. రాజు, భాస్కర్, రామారావు, రవీందర్​రెడ్డి పాల్గొన్నారు.