
- హైదరాబాద్ లో రిటైర్డ్ ఉద్యోగి నుంచి దోచేసిన సైబర్ కేటుగాళ్లు
బషీర్‌బాగ్, వెలుగు: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు పెట్టుకుని మనీ లాండరింగ్‌లకు పాల్పడుతున్నారని బెదిరించి ఓ రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోపీ పెట్టారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి (63) కి కొందరు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. తాము ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నామని, మీ మొబైల్ నంబర్‌ను త్వరలో డీయాక్టివేట్ చేస్తామని చెప్పారు.
ఆధార్ కార్డును అక్రమ కార్యకలాపాలకు వాడుతున్నారని, ముంబై సైబర్ క్రైమ్స్ లో కేసు నమోదయిందని ఆ ఉద్యోగిని భయపెట్టారు. అనంతరం వాట్సాప్‌లో వీడియో కాల్ చేశారు. రాజకీయ నాయకుడు నవాబ్ మాలిక్ ద్వారా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో లింక్ పెట్టుకున్నారని, అతని పేరిట హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, మరో బ్యాంకులో మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు.
మీరు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని భయపెట్టారు. తర్వాత బాధితుడికి నకిలీ సీబీఐ లేఖను పంపి, డీసీపీ అధికారిగా నమ్మించారు. కేసుల నుంచి తప్పించాలంటే మీ బ్యాంకులలో ఉన్న డబ్బును పంపించాలని, వాటిని వెరిఫై చేసి తిరిగి బదిలీ చేస్తామని నమ్మించారు. సీబీఐ పేరిట వచ్చిన నోటీసులో బాధితుడి ఆధార్ వివరాలతో సమాచారం ఉండడంతో ఆయన నమ్మాడు.
తన బ్యాంకు ఖాతా నుంచి రూ.20 లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేశాడు. అనంతరం వారు స్పందించకపోవడం, డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ శివమారుతి తెలిపారు.