మంచి వైద్యం కోసం పక్క రాష్ట్రాలకే

మంచి వైద్యం కోసం పక్క రాష్ట్రాలకే
  • దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి
  • ఎన్​సీడీ  ట్రీట్​మెంట్​పై తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో నాన్- కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్ సీడీ)కు సరైన చికిత్స దొరకట్లేదని తాజా సర్వేలో తేలింది. దీంతో ఈ జబ్బులకు చికిత్స కోసం జనం పక్క రాష్ట్రాలకు వెళుతున్నారని వెల్లడైంది. 20 రాష్ట్రాల నుంచి 63% మంది ప్రజలు చికిత్స కోసం పోతున్నారని ట్రాన్స్‌‌ఫార్మ్  రూరల్ ఇండియాస్  డెవలప్‌‌మెంట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ, సంబోధి రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్‌‌ కలిసి నిర్వహించిన సర్వే తేల్చింది. 20 రాష్ట్రాల్లోని 6,478 మంది నుంచి సేకరించిన వివరాలతో రూపొందించిన ఈ సర్వే రిపోర్టును ఆగస్టు 1న విడుదల చేశారు. 

అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి 73% మంది మంచి చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపింది. ఇందులో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ నుంచి 60% మంది ఉన్నారు. పశ్చిమ రాష్ట్రాల నుంచి 29%, దక్షిణాది రాష్ట్రాల నుంచి 28%, తూర్పు రాష్ట్రాల నుంచి 27% మంది చికిత్స ​కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్లు వివరించింది. 

సౌత్​లో సంప్రదాయ వైద్యంపై ఆసక్తి

దక్షిణ భారతంలో 28% మంది రోగులు సంప్రదాయ ఔషధాలు, చికిత్సా పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే రిపోర్టు తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 22% మంది ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు పొందినట్లు చెప్పారు. ఈ లబ్ధిదారుల్లో 30% మంది కార్డు ద్వారా చికిత్స తీసుకున్నట్లు రిపోర్టు పేర్కొంది. ఈ పదేండ్లలో మెడికల్ టూరిజానికి ఇండియా డెస్టినేషన్​గా మారినప్పటికీ.. దేశంలోని చాలా ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు నిర్లక్ష్యానికి గురైనట్లు రిపోర్టు తెలిపింది.