గాజాలోకి ఎంటరైన ట్రక్కులు

గాజాలోకి ఎంటరైన ట్రక్కులు

రఫా/ జెరూసలెం/ ఖాన్​యూనస్: యుద్ధం మొదలై న 2 వారాల తర్వాత గాజా ‘తలుపులు’ తెరుచుకున్నాయి. ఆహారం, నీరు, ఇంధన కొరతతో అల్లాడుతున్న పాలస్తీనా ప్రజల కోసం.. రఫా బార్డర్‌‌ పాయింట్‌‌‌‌ను ఈజిప్టు ఓపెన్ చేసింది. దీంతో నిత్యావసరాలు, మందులతో కూడిన మానవతా సాయంతో వచ్చిన ట్రక్కులు బార్డర్‌‌‌‌ దాటాయి. పలు ట్రక్కులు గాజాలోకి ఎంటర్ అవుతున్న వీడియోలను ఈజిప్ట్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ అధీనంలో లేని ఏకైక దారి రఫా మాత్రమే. ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న ఈ రూట్ నుంచి ట్రక్కులు వచ్చేందుకు తొలుత ఇజ్రాయెల్ అంగీకరించలేదు. దీంతో కొన్ని రోజులుగా మానవతా సాయాన్ని తీసుకొస్తున్న కార్గో విమానాలు, ట్రక్కులు.. రఫా బార్డర్ వద్దే ఆగిపోయాయి. అమెరికా విజ్ఞప్తి నేపథ్యంలో ట్రక్కులు వచ్చేందుకు ఇజ్రాయెల్​ ఓకే చెప్పింది. గాజా ప్రజలకు సాయం పంపిణీకి సంబంధించి రఫా బార్డర్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం యూఎన్​ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పరిశీలించారు. ‘‘ఇవి కేవలం ట్రక్కులు మాత్రమే కాదు.. గాజా ప్రజల లైఫ్‌‌లైన్. గాజాలోని ఎంతో మంది ప్రజల చావు – బతుకుల మధ్య వ్యత్యాసమే ఆ ట్రక్కులు’’ అని ఆయన చెప్పారు.   

ఇద్దరు అమెరికన్ల విడుదల

ఇద్దరు అమెరికన్ బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో బందీలు ఉన్న వారు కూడా విడుదల అవుతారన్న ఆశలు బాధితుల బంధువుల్లో చిగురించాయి. ఈ నెల 7న చేసిన దాడుల్లో 1,400 మందిని చంపి, 200 మందిని హమాస్ కిడ్నాప్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన తల్లీ కూతుళ్లు జుడిత్, నటాలీ రానన్‌‌ను రిలీజ్ చేసింది. తన కూతురు నటాలీ రానన్ ఆరోగ్యంగానే ఉందని ఆమె తండ్రి ఉరి రానన్ చెప్పారు. తల్లీ కూతుళ్ల విడుదలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌.. 
తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

మరో ‘నక్బా’!

ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజా ప్రజలు ఖాన్ యూనస్‌‌లోని టెంట్ సిటీలో తలదాచుకుంటున్నారు. వరుసగా కట్టిన టెంట్లలో ఎంతోమంది రక్షణ పొందుతున్నారు. ఈ పరిస్థితి గతంలో పాలస్తీనియన్లు సామూహికంగా వలసపోయిన ఘటనను గుర్తుచేస్తున్నది. నాటి ఈ సామూహిక వలసలను ‘నక్బా’(మహా విపత్తు) అని అంటారు. 1948కి యుద్ధానికి ముందు, యుద్ధ సమయంలో దాదాపు 7 లక్షల మంది పాలస్తీనియన్లు.. ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. వారి కోసం వెస్ట్‌‌ బ్యాంక్, గాజా, పక్కనున్న అరబ్ దేశాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లే.. తర్వాత తమ శాశ్వత నివాసాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఈ టెంట్లు.. భవిష్యత్తులో తమ నివాసాలు అవుతాయా? అన్న ఆందోళన గాజా ప్రజల్లో నెలకొంది. అయితే యూఎన్ పాలస్తీనియన్ రెఫ్యూజీ ఏజెన్సీ మాత్రం ఈ టెంట్లు పర్మినెంట్ కాదని చెబుతున్నది.