సీసీఎస్ కు రూ. 200 కోట్లు చెల్లించాలి..ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం

సీసీఎస్ కు రూ. 200 కోట్లు చెల్లించాలి..ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం
  • నెల రోజుల్లో నిధులు విడుదల చేయాలన్న కోర్టు
  • లోన్​ల కోసం ఎదురు చూస్తున్న 7 వేల మంది ఆర్టీసీ కార్మికులు

హైదరాబాద్, వెలుగు: “కార్మికుల జీతాల నుంచి కట్ చేసిన నిధుల్లో రూ.200 కోట్లు 2 వాయిదాల్లో సీసీఎస్​కు చెల్లించాలి. మొదటి నెల రోజుల్లో రూ.100 కోట్లు, తరువాత నెల రోజుల్లో మరో రూ.100 కోట్లు చెల్లించాలి. ఈ ఫండ్స్ చెల్లించారా? లేదా? అన్నది 6 వారాల తర్వాత పరిశీలిస్తం.” అని గత నవంబర్ 25న ఆర్టీసీ మేనేజ్​మెంట్​ను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.900 కోట్లు ఆర్టీసీ చెల్లించాల్సి ఉందని సీసీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పైవిధంగా తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ఇచ్చి 48 రోజులు గడిచినా నిధుల కొరతతో ఆర్టీసీ సీసీఎస్​కు చెల్లించలేదు. ఆర్టీసీ కార్మికులు తమ పిల్లల ఉన్నత చదువులకు, ఇండ్లు కట్టుకొనేందుకు, పిల్లల పెండ్లీలకు, ఇతర ఖర్చుల కోసం సీసీఎస్ నుంచి లోన్లు తీసుకునేందుకు గాను వారి జీతాల్లోంచి ప్రతి నెలా7 శాతం కట్ చేస్తున్నారు. బ్యాంకులతో పోలిస్తే చాలా తక్కువ వడ్డీకి సీసీఎస్ లోన్లు ఇస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా సీసీఎస్​కు ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది. వీటిపై వడ్డీ యాడ్ చేసి సీసీఎస్ నుంచి కార్మికులకు లోన్లు ఇస్తుంటారు. అయితే, నిధుల కొరత, బడ్జెట్​లో కేటాయించిన ఫండ్స్​ ప్రభుత్వం విడుదల చేయకపోవటం, తెచ్చిన అప్పులకే ప్రతి నెలా వడ్డీలే రూ.25 కోట్లు చెల్లిస్తుండటంతో సీసీఎస్​కు ఆర్టీసీ మేనేజ్​మెంట్ ఆగస్ట్ 2020 నుంచి చెల్లించటం లేదు.  సీసీఎస్​కు ఇవ్వాల్సిన నిధులతోనే కార్మికులకు జీతాలు, లోన్లకు వడ్డీ చెల్లిస్తున్నారని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వేలాది మంది కార్మికులు సీసీఎస్ లోన్ల కోసం రెండేండ్ల నుంచి ఎదురు చూస్తున్నారు.   

7వేల లోన్ అప్లికేషన్లు పెండింగ్ 

ఆర్టీసీ మేనేజ్​మెంట్ నుంచి బకాయిలు రాక కార్మికులకు సీసీఎస్ నుంచి లోన్లు అందటం లేదు. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 7వేల  మంది లోన్ అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయని, ఫండ్స్ లేకపోవటంతో వీరికి లోన్లు ఇవ్వలేదని సీసీఎస్ అధికారులు చెబుతున్నారు. సీసీఎస్​లో సభ్యత్వం ఉన్న వారిలో 90 శాతం మంది డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నీషియన్లే ఉన్నారు. తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయని అప్లికేషన్లు పెట్టుకోగా లోన్లు రావటం లేదని వాపోతున్నారు. 

సీసీఎస్ అధికారులకు అపాయింట్​మెంట్ ఇవ్వని ఆర్టీసీ ఎండీ సీసీఎస్ నిధులు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీని విడుదల చేయాలని గత రెండేండ్ల నుంచి ఆర్టీసీ ఎండీని సీసీఎస్ అధికారులు కోరుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సీసీఎస్ అధికారులు బస్ భవన్​కు వెళ్తున్నా ఎండీ సజ్జనార్ వారిని కలిసేందుకు నిరాకరిస్తున్నారు.

మెంబర్ షిప్ రద్దు చేసుకుంటున్రు

సీసీఎస్ లో ఆర్టీసీ కార్మికులు, అధికారులు మొత్తం 47 వేల మందికి మెంబర్ షిప్ ఉండగా లోన్లు రాకపోవటంతో 10 వేల మంది కార్మికులు మెంబర్ షిప్ ను రద్దు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో 250 మంది అధికారులకు సీసీఎస్ మెంబర్ షిప్ ఉండగా ఎండీ తరువాత హోదాలో ఉండే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లు సైతం మెంబర్ షిప్ రద్దు చేసుకున్న వారిలో ఉన్నారు. వీరికి జీతం, ఇతర అలవెన్సులు అన్ని కలిపి ప్రతి నెలా  రూ.3 లక్షలపైనే వస్తోంది. ఇంత పెద్ద అధికారులే మెంబర్ షిప్ క్యాన్సిల్ చేసుకోవటంతో కార్మికులు కూడా రద్దు చేసుకుంటున్నారు. ఆర్టీసీ మేనేజ్ మెంట్ నుంచి బకాయిలు రూ. వెయ్యి కోట్లకు సమీపిస్తుండటం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా  బకాయిలను చెల్లించే పరిస్థితి లేకపోవటంతో ఈడీలు మెంబర్ షిప్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆదిలాబాద్​కు చెందిన రమేశ్​ నాయక్ ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య క్యాన్సర్​తో బాధపడుతూ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ పొందుతోంది. దీంతో ఆమె చికిత్సకు రూ.3 లక్షలు లోన్​ కావాలని సీసీఎస్​లో అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆర్టీసీ నిధులు ఇవ్వకపోవటంతో లోన్ ఇవ్వలేమని సీసీఎస్ అధికారులు తెలిపారు. సకాలంలో డబ్బులు అందక రమేశ్​ నాయక్ భార్య ఇటీవల మరణించింది. ఇన్నేండ్లు సంస్థలో  డ్యూటీ చేసినా లోన్ ఇవ్వకుండా చేతులెత్తిసిందని మండిపడ్డారు. తన భార్య చావుకు ఆర్టీసీ, సీసీఎస్ కారణమని బయటకు చెప్పలేని భాషలో ఆయన తిట్టారని సీసీఎస్ సిబ్బంది చెబుతున్నారు.హైదరాబాద్​కు చెందిన  శ్రీనివాస్ ఆర్టీసీ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. తన కూతురు వివాహం కోసం రూ.10 లక్షలు లోన్ కావాలని గత ఏడాది అప్లికేషన్ పెట్టుకుంటే ఫండ్స్​లేవని ఇంత వరకు లోన్ శాంక్షన్ కాలేదు. దీంతో సీసీఎస్​లో తన సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నాడు. తన అకౌంట్​ను సెటిల్ చేయాలని అధికారులకు అప్లికేషన్ పెట్టుకున్నాడు.