- డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
 - ఆర్టీసీ డ్రైవర్ తప్పేం లేదు
 
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. ‘‘రోడ్డు మూల మలుపు వద్ద స్పీడ్‌గా వెళ్తున్న టిప్పర్.. నియంత్రణ
కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు మాకు చెప్పారు. 
కంకర లోడ్ తో టిప్పర్ స్పీడ్‌గా వెళ్తున్నది. అప్పుడే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు భాగాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగంతో పాటు కుడి వైపు పూర్తిగా ధ్వంసమైంది. ఢీకొట్టిన టిప్పర్.. ఆ తర్వాత బస్సు వైపు ఒరిగిపోయింది. దీంతో అందులోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడడంతో ఊపిరి ఆడక చనిపోయారు’’అని ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంపై తాము ప్రాథమిక విచారణ జరిపామని, ఇందులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.
బస్సు పూర్తిగా ఫిట్‌నెస్ తోనే ఉందని, డ్రైవర్ సర్వీసు రికార్డు ప్రకారం ఇప్పటి వరకు ఆయన డ్రైవింగ్ లో ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేదని పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఆర్టీసీ యాజమాన్యం స్పందించి సమీపంలోని డిపో మేనేజర్లను అప్రమత్తం చేసిందని, ఆ వెంటనే తమ ఉద్యోగులు, అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని వివరించారు. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృతి చెందారని, అందులో 14 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
