హైదరాబాద్, వెలుగు : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) కోరింది. అలాగే.. ఉద్యోగులకు తక్షణమే హెల్త్ కార్డులు అందేలా ఉత్తర్వులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. సోమవారం సీఎస్ రామకృష్ణారావును సెక్రటేరియెట్‌లో టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు కలిశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించి వినతి పత్రం సమర్పించారు.
జీవో 317లో భాగంగా జారీ చేసిన జీవో 243 అమలులో మిగిలిపోయిన స్పౌజ్ ఉద్యోగులకు, జీవో 244 ప్రకారం వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఇవ్వాలని సీఎస్ ను కోరారు. సాధారణ అంతర్ జిల్లా భార్యాభర్తల బదిలీలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించాలని, జీవో 190లో రిటైన్ అయిన ఉద్యోగులకు, కేడర్ మారిన వారికి అవకాశం ఇవ్వాలన్నారు. అలాగే, స్కూల్ ఎడ్యుకేషన్‌లో జీవో 190 అమలులో 25 జీవో (రేషనలైజేషన్) అమలు కారణంగా ఖాళీలు కనిపించకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై రివ్యూ చేయాలన్నారు. సీఎస్‌ను కలిసిన వారిలో దామోదర్ రెడ్డి, ముజీబ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.
