ఏదైనా అకేషన్ రైజ్ చేయడంలో గూగుల్ సెర్చ్ ఇంజన్ ముందుంటుంది. అదే ముందుచూపుతో కరోనా వైరస్ కంట్రోల్‌కి ప్రత్యేక డూడుల్ పెట్టింది. మనిషినిగానీ, వస్తువుల్నిగానీ తాకిన తర్వాత చేతుల్ని శుభ్రపరచుకోవాలనే మెసేజ్నిచ్చింది. దీనికోసం ‘ఇన్ఫెక్షన్ కంట్రోల్ పితామహుడు డాక్టర్ ఇగ్నాజ్ సెమెల్వీస్’తో వీడియో డూడుల్ చేసింది. రెండు చేతుల్ని ఎంత శ్రద్ధగా కడుక్కోవాలో వీడియో తెలుపుతుంది.
యాంటీ సెప్టిక్ ప్రొసీజర్స్‌లో మొదటి వ్యక్తి
డాక్టర్ ఇగ్నాజ్ హంగెరీలోని బుడాలో పుట్టి, వియన్నాలో డాక్టరీ చదువుకుని, మాస్టర్ డిగ్రీని మిడ్వైఫరీ (అబ్స్టెస్ట్రిక్స్)లో చేశారు. అప్పట్లో కాన్పుల సమయంలో.. తల్లికి బిడ్డకు తరచు ఇన్ఫెక్షన్స్ సోకుతుండేవి. వీటిని ‘చైల్డ్బెడ్ ఫీవర్’గా భావించేవారు. ప్రసూతి మరణాలుకూడా ఎక్కువగా నమోదయ్యేవి. ఇగ్నాజ్ ఈ పరిస్థితిని బాగా గమనించి… డాక్టర్లు, మిడ్‌వైఫ్‌లు, నర్సులద్వారానే ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని గుర్తించారు. 1847లో వియన్నా జనరల్ హాస్పిటల్లో మెటర్నిటీ క్లినిక్ చీఫ్‌గా నియమితులయ్యాక మెడికల్ టీమ్ వ్యక్తిగత శుభ్రతపై దృష్టి పెట్టారు.
ఇగ్నాజ్ని పిచ్చోడన్నారు
అయితే, డాక్టర్ ఇగ్నాజ్ సెమెల్వీస్ చెప్పినదాన్ని మొదట్లో అందరూ వేళాకోళం చేసేవారు. చాదస్తంగా కొట్టిపారేసేవారు. ఆయనకూడా తన థియరీకి సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపలేకపోవడంతో మెడికల్ రంగంలో విమర్శలు ఎక్కువయ్యాయి. చైల్డ్ బెడ్ ఫీవర్ అనేది ఒక అంటువ్యాధని, హేండ్ వాష్‌తో దానిని నివారించవచ్చని కలవరించేవాడు. దాంతో ఆయనను మెంటల్ హాస్పిటల్లో చేర్చి గొలుసులతో కట్టేసి కొట్టేవారు. ఆ సమయంలో భుజానికి అయిన గాయంతో సెప్టిక్ అయ్యింది. చివరికి 47 ఏళ్లకే చనిపోయాడు.
అయితే, క్రమంగా ఆయన చెప్పిన హేండ్ వాష్ పద్ధతితో మంచి రిజల్ట్స్ రావడాన్ని గుర్తించారు. శానిటైజేషన్ చాలా ముఖ్యమని తెలుసుకున్నారు. డాక్టర్ ఇగ్నాజ్ చెప్పిన శానిటైజేషన్ని 20 ఏళ్ల తర్వాత ‘జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ (రోగకారకమైన వైరస్)’గా అందరూ ఆదరించారు. లూయీ పాశ్చర్ ‘జెర్మ్ థియరీ’, జోసెఫ్ లీస్టర్ ‘హైజీనిక్ మెథడ్స్’, రాబర్ట్ కోచ్ ‘ఇన్ ఫెక్షన్స్ ట్రాన్స్మిషన్’ థియరీలకు డాక్టర్ ఇగ్నాజ్ పరిశోధనే ఆధారం. అప్పటినుంచే ఇగ్నాజ్ థియరీని ఒప్పుకున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ ఆపడానికి ‘జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్’నే ప్రపంచం పాటిస్తోంది.
ఇగ్నాజ్ ఏం చెప్పారంటే…
డాక్టర్లతోపాటుగా ప్రసూతి వైద్యం చేసే ప్రతి ఒక్కరూ చేతుల్ని క్లోరినేటెడ్ లైమ్ సొల్యూషన్‌తో కడుక్కోవాలని సూచించారు. జనరల్ చెకప్లోనూ, ఆపరేషన్ల సమయంలోనూ, శవ పరీక్షలు చేసేటప్పుడు శానిటైజ్ చేసుకోమన్నారు. పేషెంట్లను గ్యాప్ లేకుండా చూడడంవల్ల ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే పేషెంట్‌కి పేషెంట్‌కి నడుమ మెడికల్ టీమ్ తమ చేతులకు ఎలాంటి వైరస్ లేకుండా వేళ్ల సందులు, అరచేతులు పట్టి పట్టి శుభ్రం చేసుకోవాలన్నారు.

