పెబ్బేరు సంత స్థలాన్ని కాపాడే బాధ్యత నాదే : ఎమ్మెల్యే మేఘారెడ్డి

పెబ్బేరు సంత స్థలాన్ని కాపాడే బాధ్యత నాదే : ఎమ్మెల్యే మేఘారెడ్డి
  •     ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు:  వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పెబ్బేరు సంత స్థలాన్ని కాపాడే బాధ్యత తనదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో  నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన అధికార బలంతో దేవుడి భూములను వివాదాస్పదం చేసి, అక్రమంగా కాజేయాలని చూశారని ఆరోపించారు. వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట మార్చేలా కుట్రలు పన్నారని, తహసీల్దార్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 

సంత స్థలం విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, ముఖ్యమంత్రికి, రెవెన్యూ శాఖకు తాను రాసిన లేఖల ద్వారా ఈ భూమిని సంతకే దక్కేలా కృషి చేస్తున్నానని తెలిపారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. కర్వెన రిజర్వాయర్ బాధితుల పేరుతో బినామీలకు కట్టబెట్టిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటే అక్కడే కాలేజీ నిర్మిస్తామని సవాల్ విసిరారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తే గతంలో జరిగిన అక్రమాలను బయటపెడతానని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్​పర్సన్ శివసేనారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.