- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోరుట్ల, వెలుగు: కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ ప్రాజెక్టును ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి ప్రాజెక్టు పనుల పురోగతిని రివ్యూ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. గతంలో కలికోట ప్రాజెక్టు కోసం రైతులు, నాయకులు కలిసి 37 నెలల పాటు ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. సీఎం నేతృత్వంలో రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగునీటిని అందించే ప్రాజెక్టుల్లో కలికోటను చేర్చినట్లు చెప్పారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా వైఎస్సార్ హయాంలో మల్యాల గ్రామంలో జలయజ్ఞంలో భాగంగా రూ.1,737 కోట్లతో ప్రాజెక్టు పనులను ప్రారంభించారని చెప్పారు. రుద్రంగి నాగారం చెరువు ఆయన హయాంలోనే పూర్తయిందన్నారు. సూరమ్మ ప్రాజెక్టు పూర్తయితే 43 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, గ్రామాల్లో చెరువులు నిండి భూగర్భజలాలు పెరిగి రైతులకు శాశ్వత ప్రయోజనం కలుగుతుందన్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూసేకరణ కోసం ఇప్పటికే రూ.45.5 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన నిధులను త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పారు. కాలువల టెండర్లు పూర్తయ్యాయని, పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండల రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రాజెక్టు పనులను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిరికొండ గ్రామంలో జింక మల్లన్న జాతర సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
