2000 ఏండ్ల కిందటి మాయన్​ సిటీ గుర్తింపు

2000 ఏండ్ల కిందటి మాయన్​ సిటీ గుర్తింపు

    గ్వాటెమాలాలోని అడవి కింద దాగిన సిటీ వెలుగులోకి

గ్వాటెమాలా: శిథిలంగా మారిపోయి.. 2000 ఏళ్లుగా భూమి కిందే ఉండిపోయిన మాయన్ల కాలం నాటి ప్రాచీన నగరం ఒకటి బయటపడింది. ఆ నగరం అవశేషాలను మధ్య అమెరికాలోని గ్వాటెమాలాలో ఉన్న ఒక అడవిలో సాన్ కార్లోస్​ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్టులు  వెలికితీశారు. ఆ ప్రాచీన సిటీలో దాదాపు 1,000 ఇండ్లు ఉండేవని గుర్తించారు. నదీ తీరంలో ఆ నగరం ఉండేదని, దాని చుట్టూ 160 కిలోమీటర్ల మేర కాజ్​ వేలు  ఉన్నట్లు ఆధారాలు లభించాయని చెప్పారు. ఈ కాజ్​ వేల మీదుగానే మాయన్ లు రాకపోకలు సాగించేవారని అంచనా వేస్తున్నారు. నగరం పరిధిలో కొన్ని పిరిమిడ్లను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. వేడుకలు, వినోద కార్యక్రమాలు, రాజకీయ కార్యకలాపాలు జరుపుకునేందుకు ప్రత్యేక భవనాలను ఆనాడే మాయన్స్​ నిర్మించుకున్నారని తెలిపారు. 

జల వనరులను నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు, కెనాల్స్​ను.. క్రీడాపోటీల నిర్వహణ కోసం మైదానాలను  కూడా​ నిర్మించుకున్నారని చెప్పారు. లైడార్​ టెక్నాలజీతో నిర్వహించిన ఏరియల్​ సర్వేలో ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని ఆర్కియాలజిస్టులు వెల్లడించారు. “మా అధ్యయనంలో భాగంగా రాత్రివేళ విమానం నుంచి గ్వాటెమాలాలోని ఆ అడవిపైకి లేజర్​ కిరణాలను ప్రసరింపజేశాం.. ఓ  ప్రదేశం నుంచి వెనక్కి వచ్చిన కాంతి కిరణాలను కూడగట్టి దృశ్య రూపంలోకి మారిస్తే ఒక నగరం నమూనా వచ్చింది. అది దాదాపు 2000 ఏళ్ల కిందటిదని తెలిసి ఆశ్చర్యపోయాం”అని  ఒక శాస్త్రవేత్త  చెప్పారు. ఈ వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘ఎన్షియంట్​ మెసోఅమెరికా’ జర్నల్​లో పబ్లిష్​ అయింది.