20 వేల మంది భారతీయులు మరణించారు: యూఎన్‎లో పాక్‎పై భారత్ ఫైర్

20 వేల మంది భారతీయులు మరణించారు: యూఎన్‎లో పాక్‎పై భారత్ ఫైర్

న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్‎పై ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ ఫైర్ అయ్యింది. యూఎన్‎లో  పాకిస్తాన్ ప్రతినిధి సింధూ నది జలాల ఒప్పందం రద్దు అంశాన్ని లేవనెత్తారు. భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసిందని..  నీరు జీవకోటికి ప్రాణమని.. యుద్ధానికి ఆయుధం కాదని వేదాలు వల్లించారు. ఈ క్రమంలో పాక్ ప్రతినిధి వ్యాఖ్యలకు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన తర్వాతే.. భారత్ సింధూ నది జలాల ఒప్పందం రద్దు చేసుకుందని క్లారిటీ ఇచ్చారు. సింధూ నది జలాల ఒప్పందం రద్దుపై పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపే వరకు సింధూ ఒప్పందం నిలిచే ఉంటుందని యూఎన్ వేదికగా తేల్చి చెప్పారు. 

భారత్ 65 సంవత్సరాల క్రితం సింధు నది జల ఒప్పందంపై చిత్తశుద్ధితో సంతకం చేసిందని.. ఒక ఎగువ నదీ తీర రాష్ట్రంగా ఇండియా ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. కానీ ఆరున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ భారతదేశంపై మూడు యుద్ధాలు, వేలాది ఉగ్రవాద దాడులను ప్రేరేపించడం ద్వారా ఆ ఒప్పందం స్ఫూర్తిని ఉల్లంఘించిందని విమర్శించారు. గత నాలుగు దశాబ్దాలలో పాక్ మూలాలున్న ఉగ్రవాద దాడుల్లో 20 వేల మందికి పైగా భారతీయులు మరణించారని చెప్పారు. 

అయినప్పటికీ భారత్ అసాధారణ సహనం, ఉదారతను ప్రదర్శించిందన్నారు. ఇండియాలో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రాయోజిత సరిహద్దు ఉగ్రవాదం పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక శ్రేయస్సు దెబ్బ తీస్తోందని ధ్వజమెత్తారు. 2012లో జమ్మూ కాశ్మీర్‌లోని తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారని గుర్తు చేశారు. ఈ విరక్త చర్యలు మా ప్రాజెక్టుల భద్రతకు, పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తూనే ఉన్నాయని దుయ్యబట్టారు.