మంచిర్యాలలో జోన్​ మారింది .. ప్రమోషన్ ఆగింది! ..

మంచిర్యాలలో జోన్​ మారింది .. ప్రమోషన్ ఆగింది! ..
  • 11 ఏండ్లుగా పదోన్నతులకు నోచుకోని వరంగల్ జోన్ అభ్యర్థులు
  • మల్టీ జోనల్ సిస్టమ్​తో2012 బ్యాచ్ 5వ జోన్ ఎస్సైలకు అన్యాయం 
  • మల్టీ జోన్ -1లోకి మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు
  • ప్రమోషన్లలో ముందు వరుసలోకి వచ్చిన అక్కడి 66 మంది ఎస్సైలు
  • పాత జోన్ల ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపం

మంచిర్యాల, వెలుగు : ఉమ్మడి రాష్ర్టంలో 5వ జోన్​ పరిధిలో రిక్రూట్​అయిన 2012 బ్యాచ్​ ఎస్​ఐలకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఆరేండ్ల సర్వీస్​ పూర్తి చేసుకున్న ఎస్సైలు సీఐ ప్రమోషన్లకు అర్హులు కాగా, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జోనల్​ సిస్టమ్​ పుణ్యమా అని 101 మంది ఎస్​ఐలకు  11 ఏండ్లుగా ప్రమోషన్లు దక్కడం లేదు. 

జోనల్  సిస్టమ్​ మార్పు వల్ల పాత 6వ జోన్ పరిధిలో రిక్రూట్​ అయిన పలువురు ఎస్సైలు 317 జీవోతో ప్రస్తుత మల్టీ జోన్1 పరిధిలోకి వచ్చారు. దీంతో పాత 5వ జోన్​లో రిక్రూట్​ అయిన ఎస్​ఐలు ప్రమోషన్లలో వెనుకబడ్డారు. అంతేగాకుండా ఒకే బ్యాచ్​కు చెందిన కొందరికి పాత జోన్ల ప్రకారం, మరికొందరికి కొత్త జోన్ల ప్రకారం ప్రమోషన్లు ఇవ్వడం వల్ల ముందుగా ప్రమోషన్లు రావాల్సినవారు వెనుకబడిపోవడమే కాకుండా నాలుగైదు ఏండ్ల సర్వీస్​ నష్టపోవాల్సి వస్తోంది. 

అందువల్ల పాత జోన్ల ప్రకారం రిక్రూట్​అయిన వారికి పాత పద్ధతిలోనే ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. 2012 బ్యాచ్​ ఎస్సైలు ఇటీవల వరంగల్​లో మంత్రి కొండా సురేఖను కలిసి తమకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయబద్ధంగా ప్రమోషన్లు వచ్చేలా చూడాలని మెమోరాండం అందజేశారు.  

పాత జోన్ల ప్రకారమే ఇవ్వాలి..

ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున మల్టీ జోన్ల ప్రకారం ప్రమోషన్లు కల్పిస్తే మరింత నష్టపోతామని 2012 బ్యాచ్​ ఎస్సైలు వాపోతున్నారు. తమకు పాత జోన్ల ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. 2018లో ప్రెసిడెన్షియల్ రూల్స్ ప్రకారం స్థానికత ఆధారంగా ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు వెలువడ్డాయి తప్ప సర్వీస్ సీనియారిటీ, ప్రమోషన్ల విషయాన్ని అందులో ప్రస్తావించలేదని గుర్తుచేస్తున్నారు. 

కొత్త జోనల్ సిస్టమ్​ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 2021, 2022 సంవత్సరాల్లో 2009, 2012 బ్యాచ్​లకు చెందిన 45 మంది ఎస్సైలకు పాత జోన్ల ప్రకారమే సీఐలుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఈ ఏడాది జూన్​లో 30 మందికి , జూలైలో మరో 24 మందికి కొత్త జోన్ల ప్రకారం ప్రమోషన్లు కల్పించారు. మొత్తం 54 మందిలో పాత 6వ జోన్ నుంచి వచ్చినవారు 48 మంది కాగా, 5వ జోన్​కు చెందినవారు ఆరుగురు మాత్రమే ఉన్నారు. 

ఇకమీదట కూడా మల్టీ జోన్–1 ప్రకారం ప్రమోషన్లు కల్పించినట్లయితే మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందినవారు వరుసలోకి రావడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. ఇటు రిక్రూట్​మెం ట్లలో, అటు ప్రమోషన్లలో నష్టపోతున్న వరంగల్ జోన్ అభ్యర్థులు ఈ సమస్యను పలుమార్లు పోలీస్ ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డీపీసీని ఏర్పాటు చేసి ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, మూడేండ్లుగా దాని ఊసే లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. 

66 మంది ముందు వరుసలోకి.... 

2012లో పాత వరంగల్, హైదరాబాద్ జోన్ల వారీగా ఎస్​ఐల రిక్రూట్​మెంట్​ జరిగింది. అప్పటినుంచి వారికి ఆయా జోన్ల పరిధిలోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. కొత్త జోనల్ సిస్టమ్​లో భాగంగా ప్రభుత్వం రాష్ర్టాన్ని ఏడు జోన్లుగా విభజించడంతో పాటు రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేసింది. పాత హైదరాబాద్ జోన్ పరిధిలోని మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ప్రస్తుత మల్టీ జోన్ –1 పరిధిలోకి వచ్చాయి. 

ఈ నాలుగు జిల్లాలకు చెందిన 66 మంది ఎస్​ఐలు ప్రమోషన్లలో ముందు వరుసలోకి వచ్చారు. పాత వరంగల్ జోన్ పరిధిలో తక్కువ మంది రిక్రూట్​ కావడం, కొత్త జిల్లాలు, కమిషనరేట్లు ఏర్పాటు కావడం వల్ల ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. త్వరగా ప్రమోషన్లు కొట్టేసేందుకు చాలామంది ఎస్సైలు పాత హైదరాబాద్ జోన్ నుంచి మల్టీ జోన్– 1 పరిధిలోకి వచ్చారు. దీంతో పాత వరంగల్ జోన్ పరిధిలో 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఎస్సైల ప్రమోషన్లను కొత్తగా వచ్చినవారు కొట్టేశారు. వాస్తవానికి ఆరేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఎస్సైలకు సీఐలుగా ప్రమోషన్లు రావాల్సి ఉండగా, ఇప్పుడు మరో నాలుగైదు సంవత్సరాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.