Crypto 2026: 2025లో అదరగొట్టిన బిట్‌కాయిన్.. మరి 2026లో క్రిప్టోల పరిస్థితి ఏంటి..?

Crypto 2026: 2025లో అదరగొట్టిన బిట్‌కాయిన్.. మరి 2026లో క్రిప్టోల పరిస్థితి ఏంటి..?

Bitcoin 2026: 2025 క్రిప్టోకరెన్సీ ప్రపంచానికి మెచూరిటీ అంటే బోరింగ్ కాదని మరోసారి రుజువు చేసింది. మార్కెట్‌లో ఆటుపోట్లు ఉన్నప్పటికీ క్రిప్టో ఇకపై ఒక చిన్న ఆట కాదని ఇది అనేక అంశాలపై ఆధారపడి పనిచేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది బిట్ కాయిన్ తన ప్రయాణాన్ని ఆల్-టైమ్ హై నుండి అస్థిరత వరకు ఎలా కొనసాగించిందో ఇప్పుడు చూద్దాం.. 

2025లో లక్ష డాలర్లకు పైన ప్రారంభమైన బిట్‌కాయిన్.. అక్టోబరులో లక్షా 26వేల డాలర్ల మార్కును చేరుకుంది. అయితే నవంబర్ నెలాఖరు నాటికి ఇది 90వేల డాలర్ల స్థాయికి దిగజారింది. అంటే సంవత్సరానికి దాదాపు -3% నికర రాబడిని మాత్రమే చూపింది. పెట్టుబడిదారులకు ఇది ఊహించినంత "మూన్-షాట్" కాకపోయినా.. వారి విశ్వాసానికి మాత్రం ఇది ఒక కఠిన పరీక్ష అని చెప్పుకోవాలి. క్రిప్టోల్లో అతిపెద్ద గుర్తించదగిన మార్పుగా అమెరికాతో పాటు ఇతర మార్కెట్లలో స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల ఎంట్రీని చెప్పుకోవచ్చు. జనవరి మొదటి వారంలోనే స్పాట్ ఈటీఎఫ్‌లు సుమారు 1.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి తామంటే ఏంటో నిరూపించుకున్నాయి. ఇక్కడి వరకు కథ బాగానే ఉన్నప్పటికీ నవంబర్ నెలలో పరిస్థితి పూర్తిగా తలకిందులైందని చెప్పుకోవాలి. స్పాట్ మార్కెట్లో బిట్ కాయిన్ అమ్మకాలు తీవ్రమయ్యాయి. ఇది ప్రస్తుతం వడ్డీ రేట్ల అంచనాలు లేదా సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలను అనుసరించడం మొదలుపెట్టింది.

►ALSO READ | మార్కెట్‌లోకి నిస్సాన్ కొత్త కార్.. స్టైలిష్ లుక్, హైటెక్ ఫీచర్లతో అదిరిందిగా..

2025లో ఈటీఎఫ్‌లు బిట్‌కాయిన్‌తో పాటు ఇతర ఆస్తులకూ కీలకంగా ఉంది. ఎథీరియం కూడా జూన్ నుండి జూలై మధ్య కాలంలో 369% పెట్టుబడి ప్రవాహాన్ని చూసింది. మరోవైపు స్టేబుల్‌కాయిన్స్ నిశ్శబ్దంగా తమ పని చేసుకుపోయాయి. ఎమర్జింగ్ మార్కెట్లలో పేమెంట్స్, ట్రేడ్, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం స్టేబుల్‌కాయిన్స్ పాత్ర విస్తరించింది. 2025లో క్రిప్టోల విషయంలో జరిగిన మరో శుభపరిణామం వాటి నియంత్రణపై దృష్టి పెరగటమే. యూరోపియన్ యూనియన్‌లో MiCA(Markets in Crypto-Assets) నిబంధనలు అమలులోకి రావడం దీనికి నిదర్శనం. 

భారతదేశంలో క్రిప్టోల పరిస్థితి ఇలా..

భారతదేశానికి 2025 ఒక విరుద్ధమైన పరిస్థితిని కలిగి ఉంది. ఒకవైపు క్రిప్టో పెట్టుబడుల్లో లాభాలపై 30% ఫ్లాట్ పన్ను, ప్రతి ట్రేడ్‌పై 1% TDSతో నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం లేని అత్యంత కఠినమైన పన్ను విధానం కొనసాగింది. అయినప్పటికీ భారత్ 2025 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలోనిలిచింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆన్‌-చైన్ కార్యకలాపాల పెరుగుదలలో 69% వృద్ధికి నాయకత్వం వహించింది. 

2026లో క్రిప్టోల పరిస్థితి ఎలా ఉండొచ్చు..

పైన చెప్పుకున్నట్లుగా 2025లో క్రిప్టో కాయిన్స్ ప్రయాణం సాగగా.. ఇప్పుడు అందరి దృష్టి భవిష్యత్తులో అంటే రానున్న కొత్త ఏడాదిలో ఎలా ఉండబోతుందనే ఆసక్తిని కలిగిస్తోంది. 
1. ఈక్విటీ ఇన్వెస్టర్లతో పాటు క్రిప్టో ఇన్వెస్టర్లు కూడా వడ్డీ రేట్లపై దృష్టిని కొనసాగిస్తున్నారు. దీని తర్వాత ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడికి వస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది మళ్లీ లక్ష డాలర్లపైకి బిట్ కాయిన్ రేటును తీసుకెళ్లొచ్చని అంటున్నారు. 
2. క్రిప్టోలపై ప్రపంచవ్యాప్తంగా కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నందున.. కంప్లయెన్స్, పారదర్శకతను నిరూపించగల ఎక్స్ఛేంజీలు, ప్లాట్‌ఫారమ్‌లకు విలువ పెరుగి ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది.
3. భారత్‌తో పాటు ఆసియా-పసిఫిక్ దేశాలు స్వీకరణలో ముందంజలో ఉన్నందున క్రిప్టోలు ఒక అసెట్ క్లాస్ స్థాయి నుంచి ఒక ఇన్ ఫ్రా అనే ఆలోచన వైపుకు అందరి దృష్టి మారుతోంది. 

క్రిప్టోలు స్థూల ఆర్థిక వ్యవస్థ, రెగ్యులేటరీ, సాంకేతికతల సంక్లిష్ట కలయికగా 2025లో ప్రయాణాన్ని కొనసాగించాయని జియోటాస్ క్రిప్టో ఎక్స్ఛేంజీ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు. 2026లో విజయం సాధించాలంటే పెట్టుబడిదారులు ఒకే ఆస్తికి పరిమితం కాకుండా, నియంత్రణ పరిధిని అర్థం చేసుకుని, కంప్లయెన్స్, కస్టమర్ రక్షణకు ప్రాధాన్యత ఇచ్చే ఎక్స్ఛేంజీలను ఎంచుకోవాలని సూచించారు సుబ్బురాజ్.