కిడ్నీలో 206 రాళ్లు... డీ హైడ్రేషన్ వల్లే

కిడ్నీలో 206 రాళ్లు... డీ హైడ్రేషన్ వల్లే
  • కీ హోల్ సర్జరీ ద్వారా వ్యక్తి కిడ్నీ నుంచి 206 రాళ్లు తొలగింపు
  • డీహైడ్రేషన్ వల్లే ఈ ముప్పు వైద్యులు
  • వేస‌విలో అధిక ఉష్ణోగ్రత‌ల వ‌ల్ల డీ హైడ్రేష‌న్ కేసులు పెరిగిపోతున్నాయ‌న్న వైద్యులు
  • కొబ్బరి నీళ్లు,  మంచి నీరు తీసుకోవాలని సూచన

ప్రస్తుత జనరేషన్ లో  కిడ్నీ సంబంధిత వ్యాధులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వ్యాధి ఏదైనా గానీ, దాని వల్ల ఎదుర్కొనే పరిణామాలు మాత్రం తీవ్ర స్థాయిలోనే ఉంటున్నాయి. మామూలుగా మనకు కడుపులో కాస్త నొప్పి వస్తేనే ఒక్కోసారి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్లను వైద్యులు తొలగించారు. 

ఇక వివరాల్లోకి వెళితే, నల్లగొండకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య (56) అనే వ్యక్తి  గత ఆరు నెలల నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో స్థానిక ప్రాక్టీషనర్ ను సంప్రదించిన ఆ వ్యక్తి తాత్కాలిక ఉపశమనం పొందసాగాడు. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ ను ఇవ్వలేకపోయింది. అప్పటికీ రోజుల తరబడి నొప్పిని భరిస్తున్న రామలక్ష్మయ్య... తన రోజూ వారి విధులు కూడా సరిగా నిర్వర్తించలేకపోయేవాడు.

ఇక ఏం చేయాలో అని పాలుపోని స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి అవేర్ గ్లెనేజిల్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్ వైద్యులు (యూరాల‌జిస్ట్‌) ఆపద్భాందవులుగా కనిపించారు. ప్రారంభంలో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కిడ్నీలో ఎడ‌మ వైపు చాలా రాళ్లు ఉన్నట్లు నిర్ధారించిన వైద్యులు.... సీటీ క్యూబ్ స్కాన్ ద్వారా మరొకసారి ధ్రువీకరించుకున్నారు. ఆ తర్వాత రామలక్ష్మయ్యకు వైద్యులు కౌన్సిలింగ్ నిర్వహించి, కీ హోల్ సర్జరీకి సన్నద్ధం చేశారు. గంటసేపు శ్రమించిన వైద్యులు, ఫైనల్ గా అతని కిడ్నీలో ఉన్న 206 రాళ్లను తొలగించారు.

ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ న‌వీన్ కుమార్‌కు డాక్టర్ వేణు మ‌న్నే (యూరాల‌జిస్ట్‌), అనెస్థియోల‌జిస్ట్ డాక్టర్ మోహ‌న్‌, ఇత‌ర వైద్యులు, న‌ర్సింగ్ స్టాప్ స‌హ‌క‌రించినట్టు సమాచారం. సర్జరీ అనంతరం కోలుకున్న రామలక్ష్మయ్యను రెండో రోజే డిశ్చార్జి చేసినట్టు వైద్యులు తెలిపారు. వేస‌విలో అధిక ఉష్ణోగ్రత‌ల వ‌ల్ల డీ హైడ్రేష‌న్ కేసులు పెరిగిపోతున్నాయ‌ని వైద్యులు తెలిపారు. డీ హైడ్రేష‌న్ వ‌ల్లే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయ‌ని నిర్ధారించారు.  కొబ్బరి నీళ్లు, మంచినీరు ఎక్కువగా తీసుకుంటే డీ హైడ్రేడ్ కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వారు సూచించారు.