
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో ఉన్న మొత్తం 33 మంది న్యాయమూర్తుల్లో 21 మంది తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. న్యాయమూర్తులే స్వయంగా అప్పగించిన తమ స్థిర, చర ఆస్తుల వివరాలను సుప్రీం కోర్టు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. హైకోర్టు జడ్జిల ఎంపిక ప్రక్రియ, హైకోర్టు కొలీజియానికి అప్పగించిన బాధ్యతలు వంటి సమాచారాన్ని కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు రూ.55.375 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్, రూ.1.06 కోట్ల విలువైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, రూ.1.02 కోట్ల జనరల్ ప్రావిడెంట్ ఫండ్, సౌత్ ఢిల్లీలో డబుల్ బెడ్రూం ఫ్లాట్, కామన్‌వెల్త్ గేమ్స్ విలేజ్‌లో 2,446 స్క్వే ర్ ఫీట్ల అపార్ట్‌మెంట్, గురుగ్రామ్‌లో 56% వాటా ఉన్న ఫ్లాట్, హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీలో పూర్వీకుల ఇల్లు, 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, మారుతి స్విఫ్ట్ కారు ఉన్నాయి. తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ బ్యాంకులో రూ. 19.63 లక్షలకు పైగా ఆస్తులు, మహారాష్ట్రలోని అమరావతిలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లు, ముంబైలోని బాంద్రాలో, ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో అపార్ట్‌మెంట్లు, అమరావతి, నాగ్‌పూర్‌లో వ్యవసాయ భూములు, రూ.5.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నాయి.
గవాయ్ జీవిత భాగస్వామికి రూ.29.70 లక్షల విలువైన ఆభరణాలు, రూ.61,320 నగదు డిపాజిట్ ఉన్నాయి. కాగా, జస్టిస్ గవాయ్ మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ కేవీ విశ్వనాథన్‌కు రూ.120.96 కోట్లకు పైగా పెట్టుబడులున్నాయి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఏరియా, గుల్‌మోహర్ పార్కులో ఆస్తులు, తమిళనాడులోని కోయంబత్తూరులో అపార్ట్‌మెంట్ ఉన్నాయి. ఆయన 2010 నుంచి 2025 వరకు రూ.91.47 కోట్ల ఆదాయ పన్ను చెల్లించారు. ఇలా 21 మంది జడ్జిల ఆస్తుల వివరాలు సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.