రణథంభోర్‌‌ పార్కు నుంచి 22 పులులు మిస్సింగ్‌‌!

రణథంభోర్‌‌ పార్కు నుంచి 22 పులులు మిస్సింగ్‌‌!

 

రాజస్థాన్‌‌లోని రణథంభోర్‌‌లో పులులు మిస్సయ్యాయి. గత పదేళ్లలో రణథంభోర్‌‌ జాతీయ పార్కులోని 22 టైగర్లు కనబడకుండా పోయాయి. పులుల మిస్సింగ్‌‌పై విచారణకు ఆదేశించాలని కేంద్రానికి నేషనల్‌‌ టైగర్‌‌ కన్జర్వేషన్‌‌ అథారిటీ మెంబర్‌‌ దియా కుమారి బుధవారం లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల రాజస్థాన్‌‌ రాష్ట్ర ప్రభుత్వానికి అందిన రహస్య నివేదికలో రణథంభోర్‌‌ నుంచి 22 పులులు మిస్సయ్యాయని తెలిసిందని లేఖలో దియా పేర్కొన్నారు. అంతరించే దశలో ఉన్న జంతువులను కాపాడటానికి నేషనల్‌‌ పార్కులున్నాయని, ఉన్న నంబర్‌‌ను తగ్గించడానికి కాదని అన్నారు. పులులను వేటాడే వాళ్లను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పులుల మిస్సింగ్‌‌ ఘటనపై చీఫ్‌‌ వైల్డ్‌‌ లైఫ్‌‌ వార్డెన్ స్పందించారు. 2012 నుంచి 2018 మధ్య పులులు కనిపించకుండా పోయాయని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పులులు మిస్సయ్యాయి కానీ వాటి కళేబరాలు మాత్రం కనబడలేదన్నారు. రాజస్థాన్‌‌లో ప్రస్తుతం 116 టైగర్లున్నాయని ఫారెస్టు డిపార్ట్‌‌మెంట్‌‌ వెల్లడించింది. 2012 నుంచి ఇప్పటివరకు 9 మగ, 16 ఆడ టైగర్లు మిస్సయ్యాయని పేర్కొంది. 2017లో టీ 77, టీ 90 టైగర్లు మిస్సయ్యాయని, ఆ తర్వాత రెండేళ్లలో మిస్సింగ్‌‌ కేసులు నమోదవలేదని చెప్పింది.