
హైదరాబాద్, వెలుగు: నామినేషన్ల ఉపసంహరణల తర్వాత రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 15తో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 608 మంది తమ నామినేషన్లను వాపస్ తీసుకున్నారు. 3 నియోజకవర్గాల్లో 10 లోపు మంది అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. ఇందులో నారాయణపేట, బాన్సువాడ సెగ్మెంట్లలో ఏడుగురు చొప్పున, బాల్కొండలో 8 మంది పోటీలో నిలిచారు.
ఎల్బీనగర్లో ఎక్కువ మంది అభ్యర్థులు 48 మంది తలపడుతున్నారు. అత్యధిక నామినేషన్లు దాఖలైన గజ్వేల్‌లో 70 మంది స్వతంత్రులు నామినేషన్లను వాపస్ తీసుకోవడంతో 44 మంది బరిలో నిలిచారు. ఈసారి ప్రధాన పార్టీ అభ్యర్థులు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ కాకుండా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కొంతమంది పోటీలో ఉన్నారు. వెయ్యి మందికి పైగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పోటీ చేస్తున్నారు. 10 మంది అభ్యర్థులు ఆపైన పోటీలో ఉన్న నియోజకవర్గాలు 67 ఉండగా, 34 నియోజకవర్గాల్లో 20 మంది ఆపైన క్యాండిడేట్లు బరిలో ఉన్నారు. 11 నియోజకవర్గాల్లో 30 మందికి పైగా అభ్యర్థులు, రెండు నియోజకవర్గాల్లో 40 మంది ఆపైన పోటీలో ఉన్నారు.