గ్రాండ్ గా కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవం

గ్రాండ్ గా కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవం
  • హాజరైన రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్..  
  • స్నాతకోత్సవ ఉపన్యాసం ఇచ్చిన సెర్బ్ సెక్రటరీ సందీప్ వర్మ

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవం గ్రాండ్ గా జరిగింది. నాలుగేండ్ల తర్వాత కాన్వొకేషన్ నిర్వహించడంతో స్టూడెంట్స్, వర్సిటీ మాజీ వీసీలు, ఇతర ఆఫీసర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ హాజరుకాగా.. సైన్స్​అండ్​ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు సెక్రటరీ సందీప్​ వర్మ చీఫ్​ గెస్ట్ గా హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసం ఇచ్చారు. అంతకుముందు కాకతీయ యూనివర్సిటీ విశేషాలు, సాధించిన విజయాలను వీసీ తాటికొండ రమేశ్​ వవరించారు. వర్సిటీకి క్యాంపస్​సెలక్షన్స్​లో మంచి ట్రాక్​ రికార్డ్ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ డిపార్ట్​మెంట్లకు సంబంధించిన 56 మందికి పీహెచ్​డీ పట్టాలు గవర్నర్​ చేతులమీదుగా పంపిణీ చేశారు. గురువారం ఉదయమే 192 మందికి 276 గోల్డ్​ మెడల్స్ ఇచ్చి ఆయా విద్యార్థులకు స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్​ తో ఫొటో సెషన్​కు అవకాశం ఇచ్చారు. కాగా గవర్నర్​టూర్​ సందర్భంగా కేయూలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమకొండ ఏసీపీ కిరణ్​ కుమార్​ భద్రతా చర్యలను పర్యవేక్షించగా.. కేయూ, హనుమకొండ, ఇంతేజార్​ గంజ్​, వివిధ స్టేషన్ల సీఐలు పాల్గొన్నారు.

స్టూడెంట్ లీడర్స్​ కు నో ఎంట్రీ..

కాన్వొకేషన్​ ప్రోగ్రామ్​కు వర్సిటీ డిపార్ట్​మెంట్ల నుంచి స్టూడెంట్స్​పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా వర్సిటీలో హాస్టల్స్, ఫుడ్​, స్టాఫ్​ తదితర విషయాలకు సంబంధించి చాలా సమస్యలు వేధిస్తుండడంతో ఇప్పటికే వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు వీసీ, రిజిస్ట్రార్​కు వినతిపత్రాలు ఇచ్చారు. చాలాసార్లు ఆందోళనలు కూడా చేశారు. కాగా, గవర్నర్​ టూర్​ నేపథ్యంలో వర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు కూడా కాన్వొకేషన్​ప్రోగ్రామ్​చూసేందుకు ఆడిటోరియం లోపలికి వచ్చారు. కాగా ఆయా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తారనే అనుమానంతో గవర్నర్​స్పీచ్​ స్టార్ట్​ అయిన కొద్దిసేపటికి పోలీసులు వారిని బయటకు తీసుకెళ్లారు. గవర్నర్ మాట్లాడుతుండగా.. వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లడంతో విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సమస్యలు పరిష్కరించండి..

గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను లంచ్​టైమ్​లో కేయూ విద్యా సంఘాల జేఏసీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా కేయూతో పాటు రాష్ట్రంలోని వివిధ వర్సిటీలకు సంబంధించిన సమస్యలను గవర్నర్​దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీల్లో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు టీచింగ్, నాన్​ టీచింగ్ స్టాఫ్​ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని గవర్నర్​ ను కోరారు. ఈ కార్యక్రమంలో కేయూ జేఏసీ చైర్మన్​ ఇట్టబోయిన తిరుపతి, నాయకులు గుగులోతు రాజునాయక్​, ఎండీ పాషా, మంద భాస్కర్​, కళ్లెపల్లి ప్రశాంత్​, కొండపాక రాకేశ్​, వేణురాజ్​, పన్నాల మహేశ్​ తదితరులు పాల్గొన్నారు. 

పట్టాలొచ్చిన ఆనందం

కాన్వొకేషన్​ సందర్భంగా 2013 నుంచి 2015 వరకు వివిధ డిపార్ట్​మెంట్ల లో ప్రతిభ చూపిన స్టూడెంట్లకు గోల్డ్​ మెడల్స్​, 2018, 2019లో పరిశోధనలు పూర్తి చేసిన అభ్యర్థులకు పీహెచ్​డీ పట్టాలు పంపిణీ చేశారు. నాలుగేండ్ల తరువాత కాన్వొకేషన్​ నిర్వహించడం, గవర్నర్​ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయడంతో ఆయా స్టూడెంట్స్​ సంతోషం వ్యక్తం చేశారు.

చాలా సంతోషంగా ఉంది

హెచ్​ఆర్​ఎం డిపార్ట్​మెంట్​ లో ఇంప్లిమెంటేషన్​ ఆఫ్​ సోషల్​ సెక్యూరిటీ మెజర్స్​ అండ్​ లేబర్​ వెల్ఫేర్​ ప్రోగ్రామ్స్​ అనే అంశంపై రీసెర్చ్​ చేసి  పీహెచ్​డీ పూర్తి చేశాను. ఈ అంశంపై రీసెర్చ్​ చేసినందుకు మా ప్రొఫెసర్లు, గైడ్స్​ ఎంతగానో సహకరించారు. నాలుగేండ్ల తరువాత కాన్వొకేషన్​ నిర్వహించడం, అందులో గవర్నర్​ చేతుల మీదుగా పీహెచ్​డీ పట్టాలు అందించడం చాలా సంతోషంగా ఉంది.

- సూత్రపు అనిల్​, పీహెచ్​డీ అవార్డీ

ఎంకామ్ లో మూడు గోల్డ్​ మెడల్స్​

ఎంకామ్​ లో బెస్ట్ పర్​ఫార్మెన్స్​ చూపించేందుకు చాలా కష్టపడ్డాను. అనుకున్నట్టుగానే బెస్ట్​ మార్కులతో పాస్​ అయ్యాను. మేనేజ్​మెంట్ అకౌంటింగ్ పేపర్​ లో  చూపిన ప్రతిభకు  నాకు మూడు గోల్డ్​ మెడల్స్​ రావడం చాలా ఆనందంగా ఉంది. ఒకే పేపర్​లో మూడు మెడల్స్​ రావడం సంతోషంగా ఉంది.

- కన్నూరి మంజుల, ఎంకామ్​ గోల్డ్​ మెడలిస్ట్​