ఆస్పత్రి నుంచి 23 మంది కరోనా రోగులు పరార్

ఆస్పత్రి నుంచి 23 మంది కరోనా రోగులు పరార్

ఢిల్లీ: నగరపాలక సంస్థ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 23 మంది వైద్యులకు గాని.. సిబ్బందికి గాని చెప్పాపెట్టకుండా అదృశ్యమయ్యారు. ఉత్తర ఢిల్లీ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న హిందురావు ఆస్పత్రి నుంచి గత ఏప్రిల్ నెల 19వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు మొత్తం 23 మంది ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జై ప్రకాష్ ధృవీకరించారు. ఢిల్లీలోని పేదలకు మెరుగైన వైద్యం అందించే ఈ ఆస్పత్రిలో 250 పడకలు కరోనా రోగుల కోసం కేటాయించారు. కేసులు పెరుగుతుండడంతో ఆస్పత్రిని కరోనా ఆస్పత్రిగా మార్చేశారు. మొత్తం బెడ్లన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆస్పత్రి రికార్డులను పరిశీలించగా   ఏప్రిల్‌ 19 నుంచి మే 6వ తేదీ వరకు మొత్తం 23 మంది కనిపించడంలేదని ఆయన తెలియజేశారు. వారు చెప్పకుండా మరో ఆస్పత్రికి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నామని ఆయన చెప్పారు. చికిత్స నచ్చక లేదా ఇక్కడికంటే మెరగైన సదుపాయం ఉన్న ఆస్పత్రులకు వారు వెళ్లి ఉంటారని..   ఈ విధంగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలా జరగడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణంగా మారిందని ఆయన వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఢిల్లీ పోలీసులకు తెలియజేశామని ఆయన చెప్పారు.