గడిచిన రెండేండ్లలో 23 శాతం వృద్ధి : కేటీఆర్

గడిచిన రెండేండ్లలో 23 శాతం వృద్ధి : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు:  వరల్డ్ లైఫ్ సైన్సెస్ హబ్​గా తెలంగాణ అవతరించిందని, ప్రపంచంలోని టాప్ టెన్ ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణ నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా ఉత్పత్తుల ద్వారా 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌30 నాటికి 250 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూర్చుకోవాలని టార్గెట్​గా పెట్టుకున్నామని తెలిపారు. ‘‘అడ్వాన్సింగ్ ఫర్ ఓన్: షేపింగ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్​కేర్’’థీమ్​తో హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న బయో ఏషియా 20వ ఎడిషన్​ను కేటీఆర్ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. లైఫ్​సైన్సెస్​ సెక్టార్​లో తెలంగాణ ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని తెలిపారు. తెలంగాణతో పాటు ఇండియాలో లైఫ్ సైన్సెస్​ ఇండస్ట్రీ అభివృద్ధిలో బయో ఏషియా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. వందకు పైగా దేశాల నుంచి హెల్త్​కేర్, ఫార్మా, లైఫ్​ సైన్సెస్​ రంగాలకు చెందిన ప్రముఖులను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామని వివరించారు. లైఫ్ సైన్సెస్, హెల్త్​కేర్ రంగాల వృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ అని, జీనోమ్ వ్యాలీకి అనుబంధంగా మెడ్ టెక్ పార్క్ పేరుతో విస్తరణ చేపట్టామని తెలిపారు.

గడిచిన రెండేండ్లలో 23 శాతం వృద్ధి

తమ ప్రభుత్వం హెల్త్ కేర్, ఫార్మా సెక్టార్ కు అందిస్తున్న తోడ్పాటుతో తెలంగాణ మాత్రమే దేశ, ప్రపంచ హెల్త్ కేర్ రంగం వృద్ధి చెందుతున్నదని కేటీఆర్ అన్నారు. 2030 నాటికి వంద బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులు తయారు చేసేలా ఏకో సిస్టం డెవలప్ చేయాలని టార్గెట్​గా పెట్టుకున్నామన్నారు. 2022 నాటికే 80 బిలియన్ డాలర్ల ఈకో సిస్టం రూపొందించామని, గత రెండేండ్లలో 23% వృద్ధి సాధించామన్నారు. దేశ వృద్ధి 14 శాతానికే పరిమితమైందని తెలిపారు. ఇదే వేగంతో వెళ్తే 2025 నాటికే వంద బిలియన్ డాలర్ల టార్గెట్​ రీచ్ కావడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం ఏడేండ్లలో 3 బిలియన్ల పెట్టుబడులు సాధించిందని, 4.50 లక్షల ఉద్యోగాలు కల్పించగలిగామని తెలిపారు. లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీకి తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్​గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యికి పైగా లైఫ్​సైన్సెస్ కంపెనీలకు తమ సేవలే అందుతున్నాయని, అందులో టాప్​టెన్ ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయన్నారు. 

కీలక సేవలన్నీ ఇక్కడి నుంచే..:  డాక్టర్ వాస్ నరసింహన్, నోవార్టిస్ సీఈవో

నోవార్టిస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్ మాట్లాడుతూ.. 15 ఏండ్ల కింద తాను హైదరాబాద్​లో కెపాసిటీ నిర్మించాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చానని, ఇప్పుడది పది రెట్లు పెరిగిందన్నారు. గత ఐదేండ్లలో తమ కార్యకలాపాలు రెట్టింపు చేశామన్నారు. డ్రగ్​ డెవలప్​మెంట్, డేటా మేనేజ్​మెంట్, పేషంట్ సేఫ్టీ, ప్రొడక్షన్ యూనిట్స్, పీపుల్ మేనేజ్​మెంట్ లాంటి ఎన్నో సేవలు ఇక్కడికి తీసుకొచ్చామన్నారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బయో ఏషియా సదస్సులో 50 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని ఇండస్ట్రీస్​ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. 

రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​కు ప్రాధాన్యత

రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్​కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆరజెన్, సాయి, సిన్​జెన్, డెలాయిట్, ఆక్సెంచర్, టెక్​ మహీంద్ర సహా మరికొన్ని సంస్థలను ఇందులో భాగస్వాములను చేశామని కేటీఆర్​ అన్నారు. తెలంగాణ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ లైఫ్ ​సైన్సెస్ కేంద్రంగా ఉందని తెలిపారు. నెల్సన్ మండేలా అన్నట్టు.. ‘‘నో మ్యాటర్ వేర్ యూ ఆర్ ఇన్ లైఫ్, దేర్ ఈజ్ మోర్ జర్నీ ఎహెడ్”అనే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. లైఫ్ సైన్సెస్ సెక్టారకు రీ షేప్​ ఇవ్వాలన్నదే తమ ముందున్న కల అని, దీన్ని 2030 నాటికి సాకారం చేసుకోవాలనే లక్ష్యంతో పని చేస్తామని తెలిపారు.