బీఆర్ఎస్​లో బీసీలకు 23 సీట్లేనా? : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీఆర్ఎస్​లో బీసీలకు 23 సీట్లేనా? : జాజుల శ్రీనివాస్ గౌడ్

బషీర్ బాగ్, వెలుగు: బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు 23 సీట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అభ్యర్థుల జాబితాను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పలువురు బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలలో 136 కులాలు ఉంటే 5 కులాలకు మాత్రమే టికెట్లు ఇచ్చారన్నారు. ఆరేడు శాతం ఉన్న రెడ్లకు 40 టికెట్లు కేటాయించారని, కేసీఆర్ రెడ్లకు భయపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రెడ్ల రాజ్య సమితిగా మారిందన్నారు. ఆ పార్టీలో సామాజిక న్యాయం లేదన్నారు. ఈటలను బర్తరఫ్ చేసిన మంత్రి స్థానాన్ని మరో రెడ్డికి కేటాయించేందుకు చూస్తున్నారని అన్నారు. లిస్ట్​లో ఒక్క బీసీ మహిళ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులను బీసీలు ఎక్కడి కక్కడ నిలదీయాలని, తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

బీసీలకు తీవ్ర అన్యాయం: ఆర్. కృష్ణయ్య

బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 23 టికెట్లు కేటాయించారని... కానీ 10 శాతం కూడా లేని అగ్రకులాలకు 60 శాతం సీట్లు కేటాయించారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఆవేశం ఇప్పుడు బీసీలలో వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాన్ని విడనాడాలని.. లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని హెచ్చరించారు.