23 ఏళ్లకే బళ్లారి మేయర్ గా త్రివేణి ఎన్నిక.. గతంలో తల్లి.. ఇప్పుడు కూతురు

23 ఏళ్లకే బళ్లారి మేయర్ గా త్రివేణి ఎన్నిక.. గతంలో తల్లి.. ఇప్పుడు కూతురు

కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగర మేయర్‌గా 23 ఏళ్ల డి.త్రివేణి సూరి బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగో వార్డు కార్పొరేటర్‌గా ఉన్న ఆమె మేయర్‌ పీఠానికి మార్చి 29వ తేదీన జరిగిన ఓటింగ్‌లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన త్రివేణి 18 ఏళ్లకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బళ్లారి నగర మేయర్‌గానే కాకుండా రాష్ట్రంలోని మహానగర పాలక సంస్థల్లో ఇప్పటి వరకు అతి చిన్న వయస్సులో మేయర్‌గా ఎన్నికై త్రివేణి సూరి రికార్డు సృష్టించారు. 10వ తరగతి స్థానిక సెయింట్‌ఫిలోమినా స్కూలులో పూర్తి చేసిన అనంతరం పారా మెడికల్‌ కోర్సు పూర్తి చేసిన తర్వాత అనూహ్యంగా తల్లిదండ్రుల సూచనతో 21 ఏళ్లకే 4వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికై న త్రివేణి 23వ వయస్సులో బళ్లారి నగర ప్రథమ పౌరురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. విమ్స్‌ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్‌ఫార్మసీ పూర్తి చేశారు. 

పదవి కోసం హోరాహోరీ పోటీ

మేయర్‌ స్థానం కోసం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు పోటీ పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 4వ కార్పొరేటర్‌ త్రివేణి సూరి, 7వ కార్పొరేటర్‌ ఉమాదేవి శివరాజ్‌, 35వ వార్డు కార్పొరేటర్‌ కుబేరాతో పాటు బీజేపీకి చెందిన 16వ వార్డు కార్పొరేటర్‌ నాగరత్న ప్రసాద్‌లు మేయర్‌ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ చెందిన ముగ్గురిలో హైకమాండ్‌, స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర 4వార్డు కార్పొరేటర్‌ త్రివేణి ఎంపికకు కార్పొరేటర్లతో కలిసి మద్దతు పలికారు. దీంతో పార్టీ సూచన మేరకు పోటీలో నిలిచిన కుబేరా, ఉమాదేవి తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

త్రివేణికే మొగ్గు

కాంగ్రెస్‌ నుంచి త్రివేణి సూరి, బీజేపీ నుంచి నాగరత్న ప్రసాద్‌ పోటీలో ఉండగా ఎన్నికల అధికారి, నగర కమిషనర్‌, అధికారులు ఎన్నికను నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి త్రివేణి సూరికి సిటీ కార్పొరేషన్‌లోని 39 వార్డులకు గాను 21 మంది కాంగ్రెస్‌, 5 మంది స్వతంత్ర కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. ఇటు ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ హుస్సేన్‌ కూడా మద్దతు ఇచ్చారు. 

13 మంది కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థి నాగరత్న ప్రసాద్ కు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్‌, లోక్‌సభ సభ్యుడు దేవేంద్రప్ప కూడా నాగరత్న ప్రసాద్ కు మద్దతు ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు కాంగ్రస్ అభ్యర్థికి రావడంతో మేయర్‌గా కమేలా త్రివేణి సూరి ఎంపికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

త్రివేణి తల్లి కూడా గతంలో మేయర్ 

మరో విశేషం ఏమిటంటే నూతన మేయర్‌గా ఎన్నికై న త్రివేణి తల్లి సుశీలబాయి కూడా 2018–19లో నగర మేయర్‌గా పని చేశారు. తల్లీకూతుళ్లిద్దరినీ మేయర్‌ పదవి వరించింది. మేయర్ అవుతానని తాను కలలో కూడా ఊహించలేదన్నారు త్రివేణి. తన తండ్రి ప్రోత్సాహంతో గతంలో తన తల్లి సుశీలాబాయి ఐదేళ్లు కార్పొరేటర్‌గా, ఒక ఏడాదిపాటు నగర మేయర్‌గా సేవలు అందించారని చెప్పారు. మళ్లీ తండ్రి కమేలా సూరి తనను రాజకీయాల్లోకి రావాలని సూచించడంతో ఉద్యోగానికి వెళ్లకుండా నగర కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందానన్నారు. ప్రస్తుతం మేయర్‌ గా చాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్పొరేటర్లందరి సహకారంతో మేయర్‌గా నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.