
ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిగడ్డ రేటు కన్నీళ్లు పెట్టిస్తోంది. రోజురోజుకూ ధర పెరిగిపోవడంతో ఉల్లిని కొనలేకపోతున్నారు. కానీ ఇలా ఉల్లి రేటు పెరగడానికి కారణం మన దేశంలో వాటిని నిల్వ చేసే పద్ధతి సరిగా లేకపోవడమే అంటారు మహారాష్ట్రకు చెందిన 23ఏళ్ల కళ్యాణి షిండే. దానికోసం ‘‘గోదామ్”అనే కంపెనీ ద్వారా సంప్రదాయ గిడ్డంగులను స్మార్ట్ గిడ్డంగులుగా మారుస్తున్నారు. రైతుల కన్నీళ్లు తుడుస్తున్నారు.
ప్రపంచంలో ఉల్లిగడ్డల ఉత్పత్తిలో మన దేశం రెండో స్థానంలో ఉంది. పది లక్షల మెట్రిక్ టన్నులకు పైనే ఉల్లిగడ్డలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉల్లిని పండిస్తారు. కానీ అక్కడ వాటిని నిల్వచేసే గోడౌన్లు ఉన్నా ఉత్పత్తి పాడవకుండా మాత్రం చూడలేకపోతున్నారు రైతులు. దానివల్ల ఎంత ఎక్కువ పంట పండిస్తున్నా నష్టాలపాలవుతూనే ఉన్నారు.
ఐఓటీ సెన్సర్ల ద్వారా..
గోడౌన్లలో నిల్వ ఉండే ఉల్లిని పాడవకుండా ఉంచడమంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక గడ్డ పాడైతే మిగిలిన అన్ని గడ్డలూ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐవోటీ) టెక్నాలజీని ఉపయోగించడం మొదలుపెట్టింది కళ్యాణి. గోడౌన్లలో మైక్రో క్లైమాటిక్ మార్పులను ట్రాక్ చేసే సెన్సర్లను ఏర్పాటు చేసింది. ఇది పాడయ్యే ఉల్లిగడ్డను ముందే గుర్తించి ఇండికేషన్ ఇస్తుంది. రైతులను అలర్ట్ చేస్తుంది. చెడిపోయిన ఉల్లిగడ్డల్లో వచ్చిన వాయువును గోడౌన్ మొత్తం స్ప్రెడ్ కాకుండా చూస్తుంది. దాంతో వెంటనే ఆ ప్రాంతంలోని ఉల్లిగడ్డలను సెపరేట్ చేయొచ్చు.‘‘ఇలా చేయడం వల్ల ఉల్లి పాడయ్యే అవకాశం తక్కువ. మన దేశంలో రైతులు పంటను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. అప్పుడే 20 నుంచి 30 శాతం ఉత్పత్తి పాడయ్యే అవకాశం ఉండదు. దానివల్ల రేట్లు పెరగవ’ని చెప్తోంది కళ్యాణి.
రైతుకి అండగా..
కళ్యాణి లాసల్ గావ్ లో పుట్టి పెరిగింది. ఇది ఆసియాలో ఉన్న అతిపెద్ద ఉల్లి మార్కెట్. దాంతో ఉల్లిసాగు, ఉత్పత్తి నిల్వలపై ఆమెకు అవగాహన వచ్చింది. దానికితోడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు టెక్నాలజీతో ఉల్లిగడ్డను ఎలా నిల్వచేయాలన్న దానిపైనా ప్రాజెక్ట్ చేసింది. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఉల్లిగడ్డ గోడౌన్లన్నీ జాగ్రత్తగా స్టడీ చేసింది. రైతుల కష్టాలు స్వయంగా చూసి ఇంజనీరింగ్ పూర్తయ్యాక గోదామ్ కంపెనీని ప్రారంభించిందామె.