తల్లిదండ్రులు పిల్లలకు అన్ని రకాలుగా మంచి చేయాలనుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వారు అడిగినవన్నీ కొనిస్తారు. ఈ కాలంలో అయితే కాస్ట్లీ టాయ్స్, మొబైల్ ఫోన్స్ తీసిస్తుంటారు.. ఇవే కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం బాగా ఆలోచించి.. బాండ్లు, బీమా పథకాలను బహుమతులుగా ఇస్తుంటారు.. కానీ వీటన్నింటి కంటే ఇప్పటి పిల్లలకి వాళ్ల బాల్యాన్ని గిఫ్ట్ ఇవ్వాలంటున్నారు నిపుణులు....
దగ్గరకు తీసుకోండి: మనదేశంలోని తల్లిదండ్రులు ఒక వయసు దాటిన తర్వాత పిల్లల్ని దూరం పెడుతున్నారు. దానివల్ల వాళ్లలో ఒంటరితనం పెరుగుతోందని ఎన్నో అధ్యయనాల ద్వారా వెల్లడైంది. కాబట్టి పిల్లలు.. ఎంత పెద్దవాళ్లయినా సరే వారిని లాలించడం, ముద్దు చేయడం మానేయొద్దు. పిల్లలతో ఉదయం లేదా సాయంత్రం ఒక్కసారైనా కలిసి నడవండి. అప్పుడప్పుడూ పచ్చటి పొలాలూ, అభయారణ్యాలకి తీసుకెళ్లండి. వాళ్లలోని తెలియని భయం పోయేలా చిన్నచిన్న పనులు.. అంటే మట్టిలో ఆడుకోవడం, వానలో తడవడం, మొక్కలు నాటడం లాంటివి చేయించండి.
చెడుగా మాట్లాడొద్దు :పిల్లల్లో కూడా కోపం, ఆవేశం, అక్కసు, అసూయ, భయాలుంటాయి. వాటిని వేలెత్తి చూపి చెడుగా మాట్లాడకండి. అలాంటి మాటలు వాళ్లలో అపరాధ భావం కలిగిస్తాయి. కోపాన్ని పట్టుదలగా, ఆవేశాన్ని శ్రమగా, అసూయని పోరాటపటిమగా మార్చుకోవాలని వివరంగా చెప్పండి. ఎంత తల్లిదండ్రులమైనా ఒక్కోసారి వారిపై విసుగూ, కోపం చూపిస్తాం. అందుకే వాళ్లకి పెంపుడు జంతువుల్ని దగ్గర చేయండి. అవి చూపించే ప్రేమ పిల్లల్ని హ్యాపీగా ఉంచుతుంది. అప్పుడప్పుడు. వృద్ధాశ్రమాలకి తీసుకెళ్లడం, దానం చేయడం లాంటివి నేర్పించండి.
టీవీలు, ఫోన్లకు దూరంగా: ఈ కాలం పిల్లలు టీవీలు, ఫోన్లో గేమ్స్ కి అలవాటు పడుతున్నారు. కానీ పిల్లల ఎదుగుదలకు అవి మంచిది కాదు. వాళ్ల మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పెరిగి శారీరక, మానసిక ఎదుగుదల తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారు. అందుకే టీవీలు, ఫోన్లు అవసరమైతేనే వాడనివ్వాలి. వీలైతే బయటకు తీసుకెళ్లి వాళ్లతో మానసికంగా, శారీరంగా ఎదుగుదల ఉండే గేమ్స్ ఆడించండి. ఇష్టాలన్నీ గౌరవించాలి, ఎంతసేపూ చదవమని పిల్లలపై ఒత్తిడి పెంచకండి. వాళ్ల ఇష్టాలను తెలుసుకుని ప్రోత్సహించండి. పిల్లలకిష్టమైన రంగు డ్రెస్లు కొనివ్వటం, బొమ్మలను ఇప్పించటం, వారికిష్టమైన పుస్తకాలు కొనివ్వడం లాంటివి చేయండి.
ఇలా చేస్తే పిల్లలు చాలా ఆనందంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇది వారి ఎదుగుదలపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. అలాగని అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వటం కూడా మంచిది కాదు. కొన్ని హెచ్చరికలు చేస్తూ ప్రతి విషయంలోని మంచి, చెడులను వివరిస్తే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు.
