- పోలీస్ స్టేషన్లవారీగా
- సీసీ కెమెరాల ఏర్పాటు
- జిల్లాలో 300 సీసీ టీవీలు
- వందకు పైగా సోలార్ తో నడిచేవే
ములుగు, వెలుగు : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో కేసులు త్వరగా పరిష్కారమవుతున్నాయి. ములుగు జిల్లాలో స్టేషన్లవారీగా 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, ఇందులో వందకు పైగా సోలార్‌తో పనిచేసేవి ఉన్నాయి. అంతేకాకుండా ఇండ్ల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, భద్రతకు సాయంగా ఉంటాయని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో సీసీ కెమెరాల ద్వారా 24 కీలక కేసులను పోలీసులు చేధించారు.
జిల్లాలో 300లకు పైగా కెమెరాల ఏర్పాటు..
ములుగు జిల్లాలో 10 పోలీస్ స్టేషన్లు ఉండగా, 300లకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ ద్వారా200 సీసీ కెమెరాలు ఉండగా, సిగ్నల్ సరిగాలేని ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో మరో వందకు పైగా సోలార్ ద్వారా నడిచే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ములుగు, మల్లంపల్లి మండలాల పరిధిలో 36 సీసీ కెమెరాలు ఉన్నాయి.
వెంకటాపూర్ 19, గోవిందరావుపేట 19, తాడ్వాయి 20, ఏటూరునాగారం 22, మంగపేట 20, వాజేడు 12, వెంకటాపూర్ మండలంలో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మేడారం కమాండ్ కంట్రోల్‌రూంకు అనుసంధానంగా 32 కెమెరాలు ఉండగా, మొత్తం ఐపీ కెమెరాలు 200లకు పైగా ఉన్నాయి. సోలార్ ద్వారా సిగ్నల్, విద్యుత్ సౌకర్యం లేనిచోట్ల వందకు పైగా సీసీ కెమెరాలు అమర్చి, నిత్యం పహారా కాస్తున్నారు. ఏదైనా ప్రమాదం, క్రైం జరిగితే గంటల్లోనే చేధించేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి.
ములుగు జిల్లాలో 163 హైవే వెంట నిత్యం ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఏఎన్పీఆర్ (ఆటోమేటిక్నంబర్ ప్లేట్రికగ్నేషన్) పద్ధతిలో నడిచే నాలుగు సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ములుగులో రెండు కెమెరాలు ఏర్పాటు చేయగా, ఏటూరునాగారం కేంద్రంలో మరో రెండు ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలు నిమిషానికి 60 నంబర్ ప్లేట్లను క్యాప్చర్ చేయగలుగుతాయి. ఈ కెమెరాలన్నీ డీజీపీ కార్యాలయానికి అటాచ్‌చేసి ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు.
ఆరు నెలల్లో 24 కీలక కేసుల పరిష్కారం..
ములుగు జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో పోలీసులు 24 ప్రధానమైన కేసులను సీసీ కెమెరాల సహాయంతో చేధించారు. నేరం జరిగిన సందర్భంలో సీసీ పుటేజీని పరిశీలించి కేసుల సత్వర పరిష్కారానికి పోలీసులు కృషి చేస్తున్నారు. ములుగు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 2 మర్డర్ కేసులు, 6 యాక్సిడెంట్, 2 హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసులు, 10 దొంగతనం కేసులు, ఒకటి అజాగ్రత్త, నిర్లక్ష్యం కేసు, 3 మహిళా మిస్సింగ్ కేసులను తక్కువ కాలంలో చేధించారు.
మైనర్ ఆచూకీ లభ్యం..
ములుగులో ఓ మైనర్ బాలిక పాఠశాలకు బస్సులో వెళ్తూ కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఆ బాలిక హనుమకొండ బస్సు ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. ప్రత్యేక టీం ఏర్పాటు చేసి హనుమకొండకు బాలికను తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించి 24 గంటల్లో బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గోవిందరావుపేట మండలం పస్రా పీఎస్ పరిధిలోని చల్వాయి ఆంజనేయస్వామి గుడిలో చోరీ జరగగా, రామలింగేశ్వరస్వామి ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
24 గంటల్లోనే కేసుల పరిష్కారం..
ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 డిసెంబర్ 22న ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి శివారులో జరిగిన వ్యక్తి మర్డర్ జరిగింది. ఈ కేసులో నిందితులను, వారు వాడిన వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజ్ పోలీసులకు కీలకంగా మారింది. 24 గంటలు గడవకముందే భార్యనే భర్తను ప్రియుడితో కలిసి మర్డర్ చేసినట్లుగా గుర్తించి సదరు మహిళను పట్టుకొని రిమాండ్ కు తరలించారు.
సీసీ కెమెరాలతో కేసుల ఛేదన వేగవంతం..
ములుగు జిల్లాలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గతంలో కెమెరాలు లేని సందర్భంలో కేసుల విచారణ ఆలస్యంగా జరిగేది. ప్రస్తుతం అధికారికంగా సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ల వారీగా ఏర్పాటు చేస్తుండగా, వ్యాపార సంస్థలు, పలువురు గృహస్తులకు అవగాహన కల్పిస్తుండటంతో వారు కూడా సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా కేసుల పరిష్కారం వేగవంతంగా జరుగుతోంది. జిల్లా ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. - పి.శబరీశ్, ములుగు ఎస్పీ
