పీజీ చదివింది.. ట్యాంకర్ డ్రైవర్ అయింది

పీజీ చదివింది.. ట్యాంకర్ డ్రైవర్ అయింది
  • దేశంలోనే తొలి మహిళ ట్యాంకర్ డ్రైవర్ గా కేరళ యువతి దెలిషా డేవిస్(24)
  • తండ్రి బాటలోనే ఇష్టపడి ట్యాంకర్ డ్రైవర్ వృత్తిని ఎంచుకున్న దెలిషా డేవిస్
  • అలుపు లేకుండా ట్రిప్పుకు 300 కిమీ ట్యాంకర్ నడుపుతున్న దెలిషా డేవిస్

కోచి: ఈ అమ్మాయి సాధారణ అమ్మాయిల్లానే ఎంకాం చదివింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారు  సాధారణంగా ఎక్కడైనా అకౌంటెంట్లుగా చేరతారు లేదా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాలకు ప్రయత్నిస్తుంటారు. కానీ కేరళలోని త్రిసూర్ కు చెందిన 24 ఏళ్ల దెలిషా డేవిస్ మాత్రం లారీ డ్రైవింగ్ ను వృత్తిగా ఎంచుకుంది. లారీ డ్రైవింగ్ లలో అత్యంత ప్రమాదకరమైన ట్యాంకర్ డ్రైవర్ గా చేరడమే కాదు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా ట్రిప్పుకు 300 కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తోంది. వృత్తిని ఎంతో ఆస్వాదిస్తూ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
తండ్రి ప్రోత్సాహంతోనే తాను ఈ వృత్తిని ఎంచుకున్నాని చెబుతోంది దెలిషా డేవిస్. అనుకున్నది చేసే ఇప్పటితరం అమ్మాయిలకు అచ్చమైన ప్రతినిధిలా కనిపించే దెలిషాకు చిన్నప్పటి నుంచే తండ్రిని చూస్తూ డ్రైవింగ్ అంటే మక్కువ పెంచుకుంది. ఆమె తండ్రి పీఏ డేవిస్ లారీ డ్రైవర్ కావడంతో దెలిషా ఎప్పుడూ డ్రైవింగ్ విశేషాలే అడుగుతూ ఆ దిశగా ఆసక్తి పెంచుకుంది. డేవిస్ కూడా తన కూతురును నిరుత్సాహపరచకుండా వెన్నుతట్టి ప్రోత్సహించాడు. తనతో లారీ వెంట తీసుకెళ్లి కుమార్తెకు డ్రైవింగ్ నేర్పించాడు. తన చదువు పూర్తయ్యాక తనకు తోడుగా దెలిషాను తీసుకెళ్తూ ఆమెకు డ్రైవింగ్ పై పూర్తి ఆత్మవిశ్వాసం కల్పించాడు. 
తండ్రి ప్రోత్సాహంతో డ్రైవింగ్ నేర్చుకున్న దెలిషా డేవిస్  డ్రైవింగ్ లైసన్స్ తీసుకున్న తర్వాత తానే పూర్తి స్థాయి ట్యాంకర్ డ్రైవర్ గా మారింది. వారానికి మూడు సార్లు కొచ్చి నుంచి మళప్పురం వరకు లోడింగ్.. అన్ లోడింగ్ చేస్తూ ట్యాంకర్ నడుపుతోంది.  ఇరుంబనం వద్ద ఉన్న ఆయిల్ రిఫైనరీ నుంచి చమురును త్రిసూర్ లోని ఓ పెట్రోల్ బంకుకు ట్యాంకరు ద్వారా తరలించే పనిని ఎంతో ఆస్వాదిస్తూ ఇష్టపడి చేస్తోంది. గత మూడేళ్లుగా దెలిషా కేరళ రోడ్లపై తన ట్యాంకరు లారీని పరుగులు పెట్టిస్తున్న సమయంలో పలుమార్లు సోదా చేసిన ఆర్టీయే అధికారులు ఆమె డ్రైవింగ్ నైపుణ్యం.. ఆమె ప్రతిభ చూసి ఆశ్చర్యపోతున్నారు.

 ఓసారి రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ డ్రైవింగ్ సీట్లో అమ్మాయిని చూసి వారు విస్మయానికి గురయ్యారు. దెలిషా డేవిస్ తానే డ్రైవర్నని ధైర్యంగా సమాధానమిచ్చి తన లైసన్స్ వివరాలన్నీ చూపించగా వారు నమ్మలేకపోయారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సార్, ఓ చిన్న అమ్మాయి ట్యాంకరు లారీ నడుపుతోంది, ఆమె హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసన్స్ చూపిస్తోంది, ప్రమాదకర వస్తువులు రవాణా చేసే లైసెన్స్, ఇతర అనుమతి పత్రాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని, ఆమెకు ఫైన్ వేయాలని ప్రయత్నించినా.. ఏ కారణంతో వేయాలో అర్థం కావడం లేదని మొరపెట్టుకున్నారు. ఆమె లైసన్స్ అనుమతి పత్రాలన్నీ ఒరిజినలే అని ధృవీకరించుకున్న ఆర్టీయే చెకింగ్ అధికారులు దెలిషా లారీని నడుపుతున్న తీరును పలుమార్లు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా పలుమార్లు ఆమెను ఆపి తనిఖీ చేయడంతో ఈమార్గంలో చెకింగ్ అధికారులందరికీ ఆమె చిరపరిచితురాలు అయిపోయింది.  రవాణా శాఖ అధికారులు ఆమె వాహనం కనిపించగానే అభినందించి వీఐపీ ట్రీట్ ఇస్తూ వెంటనే పంపిస్తున్నారు. 
ట్యాంకర్ డ్రైవర్ అయిన తండ్రి పీఏ డేవిస్ తన కూతురును కొడుకులా పెంచడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశం అయింది. చిన్నప్పుడే టూవీలర్ నేర్పమని మారాం చేస్తే నేర్పించాడు. అటు తర్వాత 16 ఏళ్ల వయసులోనే.. టెన్త్ పూర్తయ్యాక వేసవి సెలవుల్లో లారీ నడపడం నేర్చుకుంది. ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తయినా ఆమె ట్యాంకర్ ఖాళీ దొరికితే చాలు తండ్రి వెంట ట్యాంకర్ డ్రైవింగ్ కు వెళ్తూ..  డ్రైవింగ్ మెళకువలన్నీ వంటబట్టించుకుంది. పీజీ పూర్తి చేసిన తర్వాత వేరే ఉద్యోగాలెందుకు అంటూ  ట్యాంకర్ డ్రైవర్ గా మారిపోయింది.

తన చిరకాల స్వప్నం ఏమిటి..ఎందుకీ వృత్తిలోకి వచ్చావని ప్రశ్నిస్తే మల్టీయాక్సిల్ వోల్వో బస్సు నడపాలన్నది తన కల అని చెబుతోంది దెలిషా డేవిస్. దీని కోసం ప్రత్యేక లైసెన్స్ కోసం ప్రయత్నిస్తోంది. చదువయ్యాక అందరిలా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్న తరుణంలో లారీ ట్యాంకర్ డ్రైవర్ గా ఎందుకు చేయకూడదని ప్రశ్నించుకున్నానని..  తండ్రి ప్రోత్సాహంతో లారీ డ్రైవర్ గా వృత్తిని ఎంచుకున్నానని, తన తండ్రి తనను ప్రోత్సహించకపోతే  డ్రైవర్ ను అయ్యే దాన్ని కాదని చెబుతోంది.