చొరబాటుదారులను హతమార్చి.. తెలుగు జవాన్ వీరమరణం

చొరబాటుదారులను హతమార్చి.. తెలుగు జవాన్ వీరమరణం

హైదరాబాద్, వెలుగు: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్‌ జవాన్‌ మురళీ నాయక్ (24) వీరమరణం చెందారు. గురువారం రాత్రి జమ్మూకాశ్మీర్​లో బార్డర్  నుంచి ఐదుగురు దుండగులు చొరబాటుకు యత్నించగా వారిని మట్టుబెట్టి.. ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్.. 2022 అక్టోబర్​లో అగ్నివీర్​కు సెలెక్ట్ అయ్యారు. మొదట మహారాష్ట్రలోని నాసిక్​లో ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. తరువాత ఒక సంవత్సరం అస్సాంలో పనిచేసి.. అక్కడి నుంచి జమ్మూకాశ్మీర్​కు వచ్చి బార్డర్​లో విధులు నిర్వహిస్తున్నారు.  గురువారం రాత్రి బార్డర్​ నుంచి కొందరు దుండగులు చొరబాటుకు యత్నిస్తుండగా మురళీ నాయక్ ఐదుగురిని హతమార్చారు. 

ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు. శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి దంపతులకు మురళీ నాయక్ ఒక్కరే సంతానం. అతని మృతితో కల్లితండాలో అతని ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మురళీ నాయక్ మృతి పట్ల ఏసీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌‌‌, మంత్రులు సంతాపం తెలిపారు. మురళీ తల్లిదండ్రులతో చంద్రబాబు ఫోన్‌‌‌‌లో మాట్లాడి వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని సీఎం పేర్కొన్నారు. అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ.. అతని కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్​రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎక్స్​లో ట్వీట్​చేశారు. అలాగే, కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్, పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​ గౌడ్​, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడింట్ కేటీఆర్​కూడా మురళీ నాయక్​ వీర మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.