ఇయ్యాల్టి నుంచి విజయవాడలో సీపీఐ మహాసభలు

ఇయ్యాల్టి నుంచి విజయవాడలో సీపీఐ మహాసభలు
  • వరంగల్ నుంచి విజయవాడకు స్పెషల్ రైలు
  • తెలంగాణ నుంచి వెయ్యి వాహనాల్లో తరలివెళ్తున్నారు: సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీపీఐ 24వ జాతీయ మహాసభలు శుక్రవారం నుంచి విజయవాడలో ప్రారంభం కానున్నాయి. 18 దాకా జరిగే ఈ సభలకు దేశవ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. దీంతో పాటు 26దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీల నేతలు సౌహార్థ ప్రతినిధులుగా అటెండ్ అవుతారు. ఈ మహాసభల ప్రారంభ సూచికగా శుక్రవారం విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తారు.

తెలంగాణ నుంచి 100 ప్రతినిధులు అటెండ్ అవుతున్నారని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. సభ కోసం వరంగల్ నుంచి విజయవాడకు స్పెషల్​ రైలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి మరో వెయ్యి వాహనాల ద్వారా కార్యకర్తలు, ప్రజలు బహిరంగ సభకు తరలివస్తారన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల పట్ల ప్రజల్లో ఆదరాభిమానాలు ఏమాత్రం చెక్కు చెదరలేదని నిరూపించే రీతిలో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నిన్న సాయంత్రానికే దేశం నలుమూలల నుండి సీపీఐ నాయకులు, కార్యకర్తలు విజయవాడకు చేరుకున్నారు. బెజవాడ నగరమే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎర్రజెండాలతో తోరణాలు కట్టారు. కొన్నిచోట్ల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు.