త్వరలో కాంగ్రెస్‌‌‌‌లోకి 25 మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు: మంత్రి ఉత్తమ్

త్వరలో కాంగ్రెస్‌‌‌‌లోకి 25 మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట, వెలుగు: పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అవుతాయని, తెలంగాణలో ఒక్క స్థానంలో కూడ ఆ పార్టీ గెలవదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి ఉండదని చెప్పారు. 

త్వరలో ఆ పార్టీ నుంచి 25 మంది ఎమ్మెల్యే లు కాంగ్రెస్​లో చేరడానికి రెడీగా ఉన్నారని తెలిపారు. ఆ పార్టీ గురించి మాట్లాడడం వేస్ట్ అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11మంది మంత్రులు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి పనిచేస్తున్నామని చెప్పారు. దేశంలో బీజేపీ మత పరంగా విభజించి పాలిస్తుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్యలో జరుగుతాయని అన్నారు. ప్రజలకు ఇచ్విన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ఫెయిల్ అయిందని ఆరోపించారు. 

మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రైతుల పంటకు మద్దతు ధర కల్పించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. ఓట్లను అడిగే హక్కు బీజేపీకి లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుందని, నల్గొండలో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్​రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.