రాష్ట్రంలోని ఉపాధి కూలీలకు ఊరట

రాష్ట్రంలోని ఉపాధి కూలీలకు ఊరట
  • ఏప్రిల్‌‌‌‌ నెలకు అదనంగా 2.5 కోట్ల పనిదినాలు
  •     ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉపాధిహామీ కూలీలకు ఏప్రిల్ నెలలో అదనంగా రెండున్నర కోట్ల పనిదినాలను కల్పిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యం(లేబర్ బడ్జెట్) దాటిపోవడంతో పనులు ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్రం అదనపు పనిదినాలకు అనుమతినిచ్చింది.

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేటాయించిన పనిదినాల లక్ష్యం ఇప్పటికే పూర్తయ్యింది.  వ్యవసాయ పనులు లేక కూలీలంతా ఉపాధి హామీ పనులపైనే ఆధారపడుతున్నారు. దీంతో ఫీల్డ్ లెవల్‌‌‌‌లో పని కోసం డిమాండ్ భారీగా పెరిగింది. కొత్తగా మస్టర్లు వేయడానికి సాంకేతికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అదనపు పనిదినాల కోసం కేంద్రానికి నివేదిక పంపింది.

ఏప్రిల్ చివరి వరకు ఢోకా లేదు..

అదనంగా కేటాయించిన 2.5 కోట్ల పనిదినాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కూలీలకు ఉపాధి దొరకనుంది. ప్రస్తుతం ఎండలు ముదురుతుండటంతో కూలీలు ఇబ్బంది పడకుండా ఉదయం పూటనే పనులు ముగించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదనపు కోటా రావడంతో పెండింగ్‌‌‌‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

పనిదినాల పొడిగింపుతోపాటు వేతనాల చెల్లింపులోనూ జాప్యం జరగకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. అదనంగా ఇచ్చిన పనిదినాలకు సంబంధించి నిధులను కూడా ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ప్రణాళికలు రెడీ చేసింది. దీనివల్ల వలసలు తగ్గి.. కూలీలకు స్థానికంగానే చేతినిండా పని దొరుకుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2025–26) కేంద్ర ప్రభుత్వం 6.50 కోట్ల పనిదినాలను మాత్రమే ప్రాథమికంగా కేటాయించింది.

గతేడాది ఇచ్చిన 12 కోట్ల పనిదినాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. వేసవికాలంతోపాటు, గ్రామాల్లో పనుల డిమాండ్ కారణంగా మంత్రి సీతక్క, అధికారులు కేంద్రానికి నివేదిక పంపారు. పనిదినాలను కనీసం 12 కోట్లకు పెంచాలని కోరారు. రాష్ట్ర విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రస్తుతానికి అత్యవసరంగా 2.5 కోట్ల అదనపు పనిదినాలను పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ అదనపు పనిదినాల వల్ల రాష్ట్రంలోని సుమారు 50 లక్షల మంది యాక్టివ్ కూలీలకు పని దొరుకుతుంది.