జీవితంలో మర్చిపోలేని బర్త్​డే ఇదే

జీవితంలో మర్చిపోలేని బర్త్​డే ఇదే

పనాజీ: ‘నేను నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. నా బర్త్ డేలు ఎన్నో వచ్చాయి.. వెళ్లాయి. కానీ నేను వేడుకలకు దూరంగా ఉన్నాను. ఈసారి జరిగిన బర్త్ డే మాత్రం నాకు స్పెషల్. నా మొత్తం జీవితంలో నిన్నటి రోజు ఎమోషనల్ డే. దాన్ని ఎప్పటికీ మరిచిపోలేను’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన బర్త్ డే సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల టీకా డోసులను వేయడంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. టీకా డ్రైవ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఓ పార్టీకి జ్వరం వచ్చిందని కామెంట్ చేశారు. గోవాలో అర్హులందరికీ ఫస్ట్ డోస్ పూర్తి కాగా.. అక్కడి హెల్త్ వర్కర్లతో ప్రధాని శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘నిన్న రికార్డు స్థాయిలో 2.5 కోట్ల డోసులు వేశారు. ప్రతి గంటకు 15 లక్షల టీకాలు వేశారు. అంటే ప్రతి నిమిషానికి 26 వేలు, ప్రతి సెకనుకు 415 డోసులు వేశారు. లక్షకు పైగా సెంటర్లలో టీకా డ్రైవ్ జరిగింది. మన దేశ వ్యాక్సినేషన్ నెట్ వర్క్, స్కిల్డ్ మ్యాన్ పవర్ కు ఇదే నిదర్శనం’ అని మోడీ చెప్పారు. ఒక్క డోసు ఒక జీవితాన్ని కాపాడుతుందని పేర్కొన్నారు. 

టూరిస్టు ప్లేసులకు ప్రాధాన్యమిచ్చాం..

వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో గోవా, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలాంటి టూరిస్టు ప్లేసులకు ప్రాధాన్యమిచ్చినట్లు మోడీ చెప్పారు. దీంతో ఆయా ప్రాంతాల్లో టూరిజం ఓపెన్ అయిందని తెలిపారు. అందరికీ టీకాలు వేసిన అంతర్జాతీయ టూరిస్టు ప్లేసులలో గోవా ఒకటని చెప్పారు. టూరిజాన్ని మళ్లీ పరుగులు పెట్టించేందుకు కేంద్రం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. మొదటి 5 లక్షల మంది టూరిస్టులకు ఫ్రీ వీసా ఇస్తున్నామని, హాస్పిటాలిటీ కంపెనీలకు రూ.10 లక్షలు, టూరిస్టు గైడ్​లకు రూ.లక్ష లోను ఇస్తున్నామని వివరించారు.

‘80 కోట్ల డోసులేసినం’

దేశంలో ఇప్పటివరకు 80 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రమంత్రి మన్​సుఖ్ మాండవీయ చెప్పారు. కరోనా​ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ఫస్ట్​ ఫేజ్​లో భాగంగా హెల్త్ స్టాఫ్​కు టీకాలు వేశారు. ‘కరోనాకు వ్యతిరేకంగా దేశం పోరాడుతోంది. ఇప్పటిదాకా 80 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశాం. ఈ ఘనతను సాధించినందుకు దేశానికి అభినందనలు..’ అని మాండవీయ ట్వీట్ చేశారు.