ప్రకాశం జిల్లాలో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు.. పలువురికి తీవ్ర గాయాలు..

ప్రకాశం జిల్లాలో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు.. పలువురికి తీవ్ర గాయాలు..

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పెద్దారవీడు మండలం మద్దెల కట్ట దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. శుక్రవారం ( నవంబర్ 28 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నూజివీడు ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఎక్స్ ప్రెస్ శ్రీశైలంకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ఘటనలో 25 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో బస్సులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను స్థానికులు బయటికి తీశారు.

క్షతగాత్రులను పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో వెస్ట్ బెంగాల్ కు చెందిన ప్రయాణికులు 7 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మార్కాపురం సబ్ కలెక్టర్ నాగిరెడ్డి పెద్దారవీడు తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎస్సై, సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. 

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.