రాష్ట్రంలో డెంగీతో 25 మంది మృతి?

రాష్ట్రంలో డెంగీతో 25 మంది మృతి?

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో డెంగీ కారణంగా 25 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ తమ దృష్టికి వచ్చిన ఈ 25 మరణాలపై విచారణ చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ మరణాలన్నీ ప్రైవేటు ఆస్పత్రుల నుంచే రిపోర్ట్‌‌ అయ్యాయని, వీటికి డెంగీనే కారణమా? మరేదైనా ఉందా? అన్నదానిపై విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌‌ జిల్లాల్లో 5 అనుమానిత కేసులు నమోదవగా, ఇందులో 2 మరణాలు డెంగీ కారణంగానే సంభవించినట్టు తేలిందని డీఎంహెచ్‌‌వో వెంకట్‌‌ వెల్లడించారు. మరో 3 మరణాలపై విచారణ చేస్తున్నామని చెప్పారు. మేడ్చల్‌‌ జిల్లా పరిధిలో ఆగస్టులో డెంగీతో ముగ్గురు చనిపోయారని డీఎంహెచ్‌‌వో నారాయణ వెల్లడించారు. రెండ్రోజుల క్రితం నమోదైన మరో మరణంపై ఆడిట్ చేస్తున్నామని తెలిపారు.  ప్రతి జిల్లాలోనూ ఇలా డెంగీ మరణాలు నమోదైనప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ డెంగీ మరణాలే లేవని చెబుతోంది. అధికారిక రికార్డుల్లోనూ ఇంతవరకూ ఒక్క డెంగీ మరణాన్ని కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.

రోజూ 250–300 కేసులు 

రాష్ట్రంలో రోజు రోజుకూ డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వారం రోజుల్లోనే సుమారు2 వేల కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్క రోజే 357 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఓ వైపు సగటున రోజుకు 250 నుంచి 300 మంది డెంగీ బారిన పడుతుంటే, ప్రభుత్వ పెద్దలు మాత్రం కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రకటిస్తున్నారు. వాస్తవ పరిస్థితికి, ప్రభుత్వ పెద్దల ప్రకటనలు విరుద్ధంగా ఉండడంతో బాధితుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదేం లెక్క!

ప్రభుత్వ లెక్కలు ఎలా ఉన్నా రాష్ర్టంలో ఇప్పటివరకూ డెంగీతో కనీసం50 నుంచి 70 మంది చనిపోయినట్టు హెల్త్‌‌ ఆఫీసర్లు, డాక్టర్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఇందులో ‘కోమార్బిడ్ కండీషన్‌‌’ కేసులే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదివరకే ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్న వారికి మరో జబ్బు వచ్చి, దాని వల్ల ఎఫెక్ట్ అవడాన్ని కోమార్బిడ్ కండీషన్‌‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం నమోదవుతున్న డెంగీ మరణాల్లో, ఈ తరహా కేసులే అధికంగా ఉంటున్నాయి. అయితే, ఈ తరహా మరణాలను ‘డెంగీ డెత్స్‌‌’గా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. వేరే రోగాలు ఏవీ లేకుండా, కేవలం డెంగీతో మరణిస్తేనే ‘డెంగీ డెత్‌‌’గా పరిగణిస్తున్నారు. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపేందుకే ప్రభుత్వం ఇలా ప్రయత్నిస్తోందని, అందుకే  అధికారిక రికార్డుల్లో మరణాలను నమోదు చేయడం లేదన్న అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ లో 2 డెంగీ మరణాలు

హైదరాబాద్‌‌లో మొత్తం 5 డెంగీ డెత్స్‌‌ మా దృష్టికి వచ్చాయి. వాటిపై విచారణ చేస్తున్నాం. ఈ ఐదింటిలో 2 డెత్స్‌‌, కేవలం డెంగీ కారణంగానే జరిగాయి. మిగతా వాటిపై రిపోర్ట్‌‌ రావాల్సి ఉంది. కోమార్బిడ్ కండిషన్‌‌ ఉంటే, ఆ మరణాన్ని డెంగీ డెత్ గా పరిగణించలేం.

– డాక్టర్‌‌‌‌ వెంకట్‌‌,
డీఎంహెచ్‌‌వో హైదరాబాద్‌‌