
గోపాల్ పేట వెలుగు: భూ సమస్య ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం గోపాల్‌పేట మండలం మున్ననూర్, తాడిపర్తి గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ తనిఖీ చేశారు. భూ సమస్యలున్న రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ సదస్సు నిర్వహించనున్న గ్రామంలో దరఖాస్తులను ఒకరోజు ముందుగానే పంచాలని, దండోరా వేయించాలన్నారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
మున్ననూర్ గ్రామంలో 35 దరఖాస్తులు, తాడిపర్తి గ్రామం నుంచి 36 మొత్తం 71 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం తాడిపర్తి గ్రామంలోని రేషన్ షాప్‌ను తనిఖీ చేశారు. వరి కోనుగోలు సెంటర్‌ను పరీశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ పాండునాయక్, అధికారులు ఉన్నారు.
గద్వాల, వెలుగు: ఇటిక్యాల మండలం వావిలాల గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజల వద్దకే వచ్చి గ్రామాల్లో భూభారతి సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాదాబైనామాల్లో సర్వే నంబర్ల మిస్సింగ్, పట్టా పాస్‌బుక్‌లో సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు వీరభద్రప్ప, నరేశ్ తదితరులు
ఉన్నారు.