మహబూబ్నగర్, వెలుగు: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నారాయణపేట జిల్లాను రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోందని.. ఎట్టిపరిస్థితుల్లో రద్దు చేయనివ్వమని ఎంపీ డీకే.అరుణ అన్నారు. అడ్డుకునే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పార్టీ సీనియర్ లీడర్ పాండురెడ్డి నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
జిల్లాలో బీజేపీకి మంచి ఆదరణ ఉందని, మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇటీవల ఆత్మకూరులో అమృత్ పథకం కింద మంజూరైన నిధులతో కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి పనులకు రాత్రికి రాత్రే శిలాఫలకాలు వేసి, ఉదయం శంకుస్థాపనలు చేశారని ఆరోపించారు. ఎంపీగా తనకు ప్రొటోకాల్ పాటించడం లేదని, సమాచారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మక్తల్, వెలుగు: మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ డీకే.అరుణ అన్నారు. మక్తల్ మండలంలోని దండు గ్రామంలో శ్రీపార్వతీ పరమేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో రూ.10 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ కామన్ హాల్ కు ఆదివారం భూమిపూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్న పనులకు బిల్లులు వస్తాయో లేదో అన్న భయం కాంట్రాక్టర్లలో ఉందన్నారు.
అమృత్పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదట పెద్ద మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చిందని, రెండో విడతలో చిన్న మున్సిపాలిటీలకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి మంత్రి వాటిని రాష్ట్ర ప్రభుత్వ నిధులని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ చెప్పే అబద్ధాలను కాంగ్రెస్ నేతలు కూడా నేర్చుకున్నారని విమర్శించారు.
గ్రామాలను అభివృద్ధి చేద్దాం
ధన్వాడ, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని గ్రామాలను ఎంపీ నిధులతోపాటు కేంద్ర నిధులతో అభివృద్ధి చేద్దామని డీకే అరుణ అన్నారు. ఆదివారం కంసాన్ పల్లిలో వీబీ–జీ రామ్ జీ పథకంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఉపాధిహామీ పనులను100 రోజుల నుంచి 125 రోజులకు పెంచామన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, సీనియర్నాయకులు పాండు రెడ్డి, శ్రీనివాసులు, కంసాన్పల్లి సర్పంచ్ గౌడ్ వరలక్ష్మి, ధన్వాడ సర్పంచ్జ్యోతి, కిష్టాపురం సర్పంచ్ కొండయ్య తదితరులున్నారు.
