అంతర్జాతీయ ప్రమాణాలతో సోమశిల అభివృద్ధి : మంత్రి జూపల్లి కృష్ణారావు

అంతర్జాతీయ ప్రమాణాలతో సోమశిల అభివృద్ధి : మంత్రి జూపల్లి కృష్ణారావు
  •     మంత్రి జూపల్లి కృష్ణారావు
  •     ఎకో టూరిజం పార్కు సందర్శన

 కొల్లాపూర్, వెలుగు: నల్లమల అడవుల మధ్య కృష్ణమ్మ ఒడిలో ఒదిగి ఉన్న సోమశిల పర్యాటక కేంద్రం ఆధ్యాత్మికతకు, ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన గమ్యస్థానమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం సోమశిల ఎకో టూరిజం పార్కును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సోమశిల తీరం నుంచి ఎకో పార్కు వరకు బోటులో విహరించారు. ప్రకృతి అందాలను, అటవీ, పర్యాటక శాఖ కల్పిస్తున్న మౌలిక వసతులను  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోమశిల–శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్ లో  ప్రకృతి అందాలు పర్యాటక ప్రేమికులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఎకో పార్క్​వ్యూ పాయింట్ వద్ద ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయన్నారు. పార్కు పరిసరాల్లోకి అప్పుడప్పుడు పులులు వంటి వన్యప్రాణులు రావడం ఇక్కడి పర్యాటకానికి మరింత ఆకర్షణను తెస్తోందని చెప్పారు. రాష్ట్ర గ్రామీణ ప్రజలతోపాటు దేశ విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేలా సోమశిలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 

సోమశిల ప్రాంతం కేవలం విహార కేంద్రంగానే కాకుండా 15 శివాలయాల సముదాయంతో ఆధ్యాత్మిక క్షేత్రంగానూ అలరారుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటకంగా ప్రాచుర్యం పొందుతున్నట్లుగానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం అటవీ ప్రాంతంలో జంతు గణనపై అధికారులను ఆరా తీశారు. జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్, రేంజర్ మద్దుమ్ తదితరులున్నారు.