వైర్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. నిలిచిపోయిన రైళ్లు.. రాత్రంతా స్టేషన్లలోనే జనం..

వైర్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. నిలిచిపోయిన రైళ్లు.. రాత్రంతా స్టేషన్లలోనే జనం..

గత వారంలో కరెంటు కట్ అవ్వడంతో స్పెయిన్ లో జనజీవనం స్తంభించిన సంగతి తెలిసిందే. కరెంటు ఎందుకు కట్ అయ్యిందో తెలియక గంటల తరబడి రోడ్లు, రైల్వే స్టేషన్లకే పరిమితం అయ్యారు జనం. వారం తర్వాత మళ్ళీ అదే పరిస్థితి.. ఈసారి రైళ్లు ఆగిపోవడంతో వేలాది మంది జనం రైల్వే స్టేషన్లకే పరిమితం అయ్యారు. రాజధాని మాడ్రిడ్ నుంచి సదరన్ స్పెయిన్ లోని అండాలూసియా మధ్య హైస్పీడ్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ఆదివారం ( మే 4 ) రాత్రి జనం రైల్వే స్టేషన్లలోనే చిక్కుకుపోయారు.

ఈ క్రమంలో రాజధాని మాడ్రిడ్ లోని అటాచో స్టేషన్లో వేలాది మంది జనం చిక్కుకుపోయారు. మాడ్రిడ్, సెవిల్లె, మలగా, వాలెన్సియా, గ్రెనడా మధ్య 30 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, 10 వేల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. 

ఆదివారం ( మే 4 ) జరిగిన దొంగతనమే ఇందుకు కారణమని తెలుస్తోంది. హైస్పీడ్ లైన్లో ఐదు ప్రదేశాల్లో కేబుల్ దొంగతనం జరిగినట్లు తెలిపారు అధికారులు. సోమవారం ఉదయం నుంచి హై స్పీడ్ లైన్లు పునరుద్దరించామని.. రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు అధికారులు.

స్పెయిన్, పోర్చుగల్‌లలో కరెంటు కట్ అయ్యి.. జనం తీవ్ర ఇబ్బందికి గురైన వారం తర్వాత ఈ ఘటన జరగటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. గత వారంలో కరెంటు కట్ అవ్వడానికి కారణం ఏంటో ఇంకా క్లారిటీ రాలేదు.గత రెండు వారాలుగా ఇలాంటి హఠాత్ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయో అంతు చిక్కటంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.