
హైదరాబాద్: కూకట్పల్లి పరిధిలోని కేపీహెచ్బీ కాలనీలో విషాదం జరిగింది. మెడ్క్వెస్ట్ డయాగ్నస్టిక్ సెంటర్లో CT సిస్టెర్నోగ్రఫీ స్కాన్ కోసం వెళ్లిన మహిళ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. స్కాన్ చేసే సమయంలో అధిక మోతాదులో సూర్యలక్ష్మి(66) అనే మహిళకు అనస్తీసియా ఇవ్వడంతో ఆ వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. సరైన వైద్య నిపుణులు లేకపోవడం, పర్యవేక్షణ లోపం వల్లే తన తల్లి చనిపోయిందని సూర్యలక్ష్మి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిస్టెర్నోగ్రామ్ స్కాన్ అనేది మెదడు, వెన్నుపాము చుట్టూ సెరెబ్రోస్పానియల్ ద్రవం (CSF) ఎలా ప్రవహిస్తుందో అంచనా వేసే ఒక రోగ నిర్ధారణ ప్రక్రియ. సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (CSF) మెదడు, వెన్నుపామును కప్పి, బయటి కుదుపుల నుంచి రక్షణ అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మెదడుకు సంబంధించిన స్కానింగ్ ప్రక్రియ. మెడ్క్వెస్ట్ డయాగ్నస్టిక్ సెంటర్లో ఈ స్కాన్ చేయించుకునేందుకు సూర్య లక్ష్మి వెళ్లగా ఇలా చనిపోవడంతో ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
ఇక.. డయాగ్నస్టిక్స్ సెంటర్ల విషయానికొస్తే.. హైదరాబాద్ సిటీలో డయాగ్నస్టిక్స్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఒకప్పుడు డయాగ్నస్టిక్స్ సౌకర్యం హాస్పిటల్‌లోనే ఉండేది. కానీ.. ఇప్పుడు అదొక సప‘రేటు’ దందా అయిపోయింది. ఇప్పుడు ప్రతి పట్టణంలో గల్లీగల్లీకీ సెంటర్లు పుట్టుకొచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయిలోనూ అందుబాటులో ఉంటున్నాయి. వీటి ఏర్పాటు, పర్యవేక్షణకు ప్రత్యేక చట్టమేమీ లేదు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద దవాఖాన్లకు పర్మిషన్ ఇచ్చినట్టే, వీటికీ జిల్లా మెడికల్ ఆఫీసర్లే అనుమతిస్తున్నారు. అంతటితో చేతులు దులుపుకుంటున్నారు.
మెడిసిన్‌కు ఉన్నట్టే డయాగ్నస్టిక్ మెషీన్లకూ ఎక్స్‌పైరీ టైం ఉంటుంది. టైం ముగిసిన మెషీన్లతో టెస్టులు చేస్తే రిజల్ట్స్‌లో తేడాలొచ్చే చాన్స్ ఉంటుంది. ఇలాంటి కాలం చెల్లిన యంత్రాలు విదేశాల నుంచి ఎక్కువగా దిగుమవుతున్నాయని, వాటికే కొన్ని మార్పులు చేసి ఇక్కడ అమ్ముతున్నారని చెబుతున్నారు. మన దగ్గర చాలా డయాగ్నస్టిక్ సెంటర్లలోనూ ఇలాంటి సెకండ్ హ్యాండ్ మెషీన్లను వాడుతున్నారని డాక్టర్లు అంటున్నారు.