పార్లమెంటులో మోదీకి చేదు అనుభవం.. వోట్ చోర్.. గద్దీ ఛోడ్.. నినాదాలతో విచిత్ర ఆహ్వానం !

పార్లమెంటులో మోదీకి చేదు అనుభవం.. వోట్ చోర్.. గద్దీ ఛోడ్.. నినాదాలతో విచిత్ర ఆహ్వానం !

ప్రధాని మోదీకి పార్లమెంటులో చేదు అనుభవం ఎదురైంది. గురువారం (ఆగస్టు 21) లోక్ సభలో విపక్ష ఎంపీలు విచిత్రంగా మోదీకి ఆహ్వానం పలికారు. లోక్ సభలోకి వస్తున్న మోదీకి చప్పట్లు కొడుతూ, నినాదాలతో వెల్ కమ్ చెప్పడంతో సభ మొత్తం ప్రతిధ్వనులతో దద్ధరిల్లింది.  

పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న క్రమంలో..  హౌస్ లోకి ప్రధాని నరేంద్ర మోదీ ఎంటర్ అవ్వడంతోనే విపక్ష సభ్యులు లేచి నిలిచొని వెల్ కమ్ చెప్పారు. వోట్ చోర్.. గద్దీ ఛోడ్.. అంటూ ఆహ్వానం పలికారు. క్లాప్స్ కొడుతూ నినాదాలు ఇస్తూ మోదీని వ్యంగ్యంగా ఆహ్వానించారు. వోట్ చోర్.. గద్దీ ఛోడ్ అంటే ఓట్ల దొంగ.. కుర్చీ దిగిపో.. అనే అర్థంలో ఎంపీలు స్లోగన్స్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

విపక్ష ఎంపీల స్లోగన్స్ తో సభ లో గందరగోళం నెలకొంది. అధికార సభ్యులు విపక్ష సభ్యులకు కౌంటర్ గా అరవటంతో సభలో మొత్తం గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. 

గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎన్నికల కమిషన్ తో కలిసి ఓట్ల దొంగతనానికి పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఉన్న ఓట్లు తొలగించి.. లేని ఓట్లను యాడ్ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందారని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శిస్తూ వస్తున్నారు. బీజేపీకి ఈసీ లబ్ది కలిగించిందని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలలో ఓట్ల చోరీకి పాల్పడి ఎన్డీఏ కూటమి గెలిచిందని ఆరోపించారు. 

అందుకు ఉదాహరణగా బెంగళూర్ లోని మహదేవ్ పుర అసెంబ్లీ సెగ్మెంట్ సర్వే చేసి.. ఓట్ల చోరీకి సంబంధించిన ఎవిడెన్స్ ఇవేనంటూ బయటపెట్టారు రాహుల్. ఇంటి నెంబర్ జీరో ఉన్న ఓటర్లు, తండ్రి పేరు లేకుండా కొన్ని ఇంగ్లీష్ లెటర్స్ తో కూడిన ఓటర్లు, ఒక్క గది ఉన్న ఇంట్లో 40, 80 మంది ఓటర్లు ఉండటం మొదలైన ఆధారలను చూపారు రాహుల్. 

చివరి అర గంటలో ఓటింగ్ శాతం పెంచి అక్రమంగా గెలుపొందారని ఆరోపించారు. బీహార్ లో కూడా అదే చేస్తున్నారని.. SIR పేరున బీజేపీకి ఓటు వేయరని భావించిన ఓటర్లను లిస్టు నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు. పార్లమెంటులో SIR పైన చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు విపక్ష ఎంపీలు.