
గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మెకు తెరపడలేదు. ఇవాళ, రేపు ముగింపు ఉంటుందని నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు చెబుతూ వస్తున్నా.. ఈ సమస్యకు పరిష్కారం మాత్రం లభించలేదు. పలుమార్లు ఇరువురు చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆధికారులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ( ఆగస్టు 21, 2025 ) ఫిల్మ్ చాంబర్ పెద్దలను కలిసిన నిర్మాతలు.. కార్మికుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు.
సినీ కార్మికుల వేతనాల పెంపుతో పాటు, 9 నుండి 9 గంటల కాల్‌షీట్, అదనపు చెల్లింపులు, బయటి వారిని షూటింగ్‌లో తీసుకోవడం వంటి అంశాలపై నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య ఒక రాజీ ఫార్ములాను తీసుకు రావడానికి ఫిల్మ్ చాంబర్ కసరత్తు చేస్తోంది. డ్యాన్సర్లు, ఫైటర్స్ వంటి వారికి ఇచ్చే వేతనాలపై కూడా ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం లేబర్ కమిషనర్ తో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యారు. వేతనాలు పెంపుపై చర్చించారు.
అయితే ఈలోగా, ఫిల్మ్ ఫెడరేషన్‌కు లేబర్ కమిషన్ ఊహించని ఝలక్ ఇచ్చింది. మెంబర్ షిప్, చందాలు ఎంత తీసుకుంటున్నారని కమిషనర్ ప్రశ్నించారు. సభ్యత్వ రుసుము, చందాలు, బ్యాంకు బ్యాలెన్సులు, ఆడిట్ రిపోర్టుల వివరాలను మూడు రోజుల్లోగా సమర్పించాలని యూనియన్ నేతలను కమిషనర్ ఆదేశించారు.
మరో వైపు గత 18 రోజులుగా సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కావడంతో నిర్మాతలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వచ్చే రోజువారి వేతనాలు కూడా నిలిచిపోవడంతో ఆకలి కేకలతో అలమటిస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూట గడవడమే కష్టంగా ఉంది. ఇంటి అద్దెలు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. అప్పులు తెచ్చి కుటుంబాన్ని పోషించుకోవల్సి వస్తోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చర్చలు రెండు మూడు రోజుల్లోనైనా కొలిక్కి వస్తాయో లేదా చూడాలి .