
జడ్చర్ల, వెలుగు : తేమ శాతం ఎక్కువ ఉందని , మద్దతు ధర ఇవ్వడం లేదని మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ లో వ్యాపారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మార్కెట్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కు మంగళవారం రైతులు భారీగా ధాన్యం తీసుకొచ్చారు. కొనుగోలు చేయాల్సిన వ్యాపారులు తేమ శాతం ఎక్కువగా ఉందని, మద్దతు ధర ఇవ్వడం కుదరదని వడ్లు కొనేందుకు నిరాకరించారు.
దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి భర్త అల్వాల్ రెడ్డి, మార్కెట్ సెక్రటరీ, పలువురు డైరెక్టర్లు ఘటనాస్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయినప్ప టికీ రైతులు శాంతించలేదు. తేమ శాతం ఉన్న వడ్లను కూడా వ్యాపారులు కొనడం లేదని మండిపడ్డారు. చివరకు వ్యాపారులను పిలిచి వడ్లు కొనేలా చర్యలు తీసుకోవాలని అల్వాల్రెడ్డి చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.