
ఇండియా దాడిని పాక్ ధృవీకరించింది. ఇండియన్ ఆర్మీ మే 6 అర్ధరాత్రి దాటాక పీవోకేలోని కోట్లి, ముజఫరాబాద్, బాహావల్‌పూర్‌సహా 9 ప్రాంతాల్లో దాడులు జరిపిందని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఈ అటాక్‌లో అనేక భవనాలు నేలమట్టం అయ్యాయని తెలిపింది. పాక్ డీజీ ఐఎస్‌పీఆర్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ స్పందిస్తూ పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారని చెప్పారు. ముజఫరాబాద్‌లోని పవర్ గ్రిడ్‌ను పేల్చివేయడంతో కరెంటు పోయి, చిమ్మ చీకట్లు అలుముకున్నాయని, ముజఫరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు.
ఇది యుద్ధ చర్యే: పాక్ ప్రధాని షెహబాజ్
పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఈ దాడులను యుద్ధ చర్యగా పేర్కొంటూ ఖండించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతర్జాతీయ, దేశీయ విమానాలను నిలిపివేశారు. ఖచ్చితంగా ఇండియా దాడులకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
భారత్‌పై కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 టెర్రరిస్ట్ బేస్‌లను మే 6న నేలమట్టం చేసింది. పూర్తి కచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎలాంటి సదుపాయాలు, బేస్‌లపై దాడులు చేయలేదని స్పష్టం చేసింది. పహల్గాంపై టెర్రరిస్టుల దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అని ట్వీట్ చేసింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణశాఖ తెలిపింది.