రంగారెడ్డి జిల్లా మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా వచ్చి చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. గురువారం ( జనవరి 8 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అతివేగంతో దూసుకెళ్లిన స్పోర్ట్స్ కారు డివైడర్‌ను ఢీకొట్టి చెట్టును గుద్దుకోవడంతో ICFAI యూనివర్సిటీకి చెందిన సూర్యతేజ, నిఖిల్, సుమిత్, రోహిత్ అక్కడికక్కడే మృతి చెందారు. మరొక విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
విద్యార్థులు మోకిల నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ హైవేపై ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ మంది ICFAI విద్యార్థులే కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి పది ప్రమాదాల్లో 9 మంది ICFAI విద్యార్థులే కావడం గమనార్హం. ఇది ప్రమాదం కాదని.. నిర్లక్ష్యమని అంటున్నారు స్థానికులు. అతివేగం చూసి చూడనట్టు వదిలేయడం వ్యవస్థ వైఫల్యమని అంటున్నారు.
ప్రతి ఏటా ICFAIలో రోడ్డు భద్రత, మాధక ద్రవ్యాలపై మూడు, నాలుగు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ వరుస ప్రమాదాల్లో విద్యార్థులు మృతి చెందడం విషాదం.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
