- మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ థ్యాంక్స్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ( ఏటీసీ) ను శాంక్షన్ చేస్తూ కార్మిక శాఖ స్పెషల్ సీఎస్ దానకిషోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు రూ.45.15 కోట్ల నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు ఇస్తున్నట్టు జీవో లో పేర్కొన్నారు. టాటా టెక్నాలజీస్, కార్మిక శాఖ భాగస్వామ్యంతో ఈ ఏటీసీని నిర్మించనున్నారు. గత ఏడాది నవంబర్ లో జరిగిన జూబ్లీహిల్స్ఉప ఎన్నిక ప్రచారంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్న విషయం తెలిసిందే.
ఆ సమయంలో ఆ నియోజకవర్గానికి ఏటీసీ మంజూరు చేయాలని అక్కడి నిరుద్యోగ యువత మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. దీంతో ఎన్నిక పూర్తికాగానే ఏటీసీ మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రస్తుతం ఏటీసీని మంజూరు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, నియోజకవర్గ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
