కొత్త గనులు వస్తేనే సింగరేణికి మనుగడ : సీతారామయ్య

కొత్త గనులు వస్తేనే సింగరేణికి మనుగడ : సీతారామయ్య
  • సంస్థకు శాశ్వత సీఎండీని నియమించాలి
  • ప్రభుత్వ బకాయిలను వెంటనే చెల్లించాలి
  • గుర్తింపు సంఘం ప్రెసిడెంట్​సీతారామయ్య

గోదావరిఖని, వెలుగు : కొత్త గనులు వస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుందని సంస్థ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్​వి.సీతారామయ్య అన్నారు. కొత్త గనులను ప్రైవేటుకు ఇవ్వకుండా సింగరేణికి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం గోదావరిఖని ప్రెస్​ క్లబ్​లో జరిగిన మీటింగ్​లో యూనియన్​ జనరల్​సెక్రటరీ రాజ్​కుమార్​తో కలిసి ఆయన మాట్లాడారు. సంస్థకు శాశ్వత సీఎండీని నియమించకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోయారు. 

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే మారుపేర్లు, విజిలెన్స్ కేసులు, సొంతింటి పథకం అమలు, పెర్క్స్ పై ఇన్ కంటాక్స్ చెల్లింపు సమస్యలు పెండింగ్​లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.47 వేల కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్​చేశారు. కాగా గుర్తింపు సంఘం కాలపరిమితి సెప్టెంబర్ 2026 వరకు ఉందని, కొన్ని కార్మిక సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనియన్​ లీడర్లు  మిర్యాల రంగయ్య, కె.సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, మడ్డి ఎల్లాగౌడ్,  ఆరెల్లి పోషం, సంకె అశోక్, సిర్ర మల్లికార్జున్, తొడుపునూరి రమేశ్ కుమార్ పాల్గొన్నారు.