ఎగవేతలు.. కూల్చివేతలు.. పేల్చివేతలు!..ఇదే కాంగ్రెస్ రెండేండ్ల పాలన: కేటీఆర్

ఎగవేతలు.. కూల్చివేతలు.. పేల్చివేతలు!..ఇదే కాంగ్రెస్ రెండేండ్ల పాలన: కేటీఆర్
  •     నిర్మాణం బీఆర్ఎస్ నైజం.. విధ్వంసం కాంగ్రెస్ లక్షణం
  •     సీఎం తన పాత బాస్ కోసం రైతుల పొట్ట కొడుతున్నడు
  •     కుర్చీ కాపాడుకోవడానికి జూపల్లి.. రేవంత్ భజన చేస్తున్నడని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు.. ఇదే రెండేండ్ల కాంగ్రెస్ పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలు ఎగవేశారని.. 420 హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు. హైడ్రా అరాచక చర్యలతో ఇండ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు. చెక్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ లు పేల్చే దరిద్రపు ప్రభుత్వం ప్రపంచంలో కాంగ్రెస్ ఒక్కటేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్ డ్యామ్‌‌‌‌ లు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిర్మిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందన్నారు. 

కేసీఆర్ ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలోనే 36 చెక్ డ్యామ్‌‌‌‌ లు కట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కొల్లాపూర్ నియోజకవర్గ చేరికల సమావేశంలో కాంగ్రెస్ పాలన, సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వంద్వ వైఖరిని కేటీఆర్ ఎండగట్టారు. పాలమూరు- – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని.. తన పాత బాస్ కు కోపం వస్తుందని ఆ ప్రాజెక్టును  సీఎం ఎండబెట్టే చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. 

90 శాతం పనులు పూర్తైన ప్రాజెక్టును..10 శాతం పనులు చేయలేక అపేశారని మండిపడ్డారు. నార్లాపూర్, కరివెన, వట్టెం, ఏదుల, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు అన్నీ రెడీగా ఉన్నాయనన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావును కొల్లాపూర్ ప్రజలు మళ్లీ గెలిపంచబోరని కేటీఆర్ అన్నారు. జూపల్లి గతంలో కేసీఆర్ గురించి గొప్పగా మాట్లాడేవారని.. నేడు మంత్రి పదవి కాపాడుకోవడం కోసమే.. సీఎం రేవంత్ భజన చేస్తున్నారని విమర్శించారు.   

యూరియా కార్డు పేరిట మోసం

యూరియా కోసం రైతులు చెప్పులు లైన్ లో పెట్టి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. గ్యారంటీ కార్డులు అమలు చేయకుండా.. ఇప్పుడు కొత్తగా యూరియా కార్డు పేరిట రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. 

గ్యారంటీలు అమలు ఎందుకు కావడం లేదని అడిగితే.. కేసీఆర్ మీదే నెపాలు మోపుతున్నారని, ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెబుతూ తప్పించుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ మళ్లీ సీఎం కావడానికి బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని ఆయన సూచించారు. సంక్రాంతి తర్వాత తిరిగి కొల్లాపూర్‌‌‌‌ లో పర్యటిస్తానని కేటీఆర్ తెలిపారు.