ప్రముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన మహాత్మా జ్యోతి రావు ఫూలే జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘ఫూలే’. ఇందులో జ్యోతిరావు పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటించగా, అనంత్ నారాయణ్ మహాదేవన్ దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, అనుయా చౌహాన్ కుదేచా, సునీల్ జైన్ కలిసి నిర్మించారు.
గతేడాది హిందీలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. పొన్నం రవిచంద్ర ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రదర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాధించిన నేపథ్యంలో కృతజ్ఞతను తెలియజేస్తూ గురువారం (Jan8) ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ ‘సమాజంలోని ఎన్నో దురాచారాలను రూపుమాపేందుకు ఫూలే దంపతులు పోరాటం చేసి, సమాజ హితం కోసమే తమ జీవితాలను అంకితం చేశారు. ఇలాంటి గొప్పవారి జీవిత చరిత్రను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. హిందీ డబ్బింగ్ అయినా తెలుగు చిత్రంలాగే ఉంటుంది. మాటలు, పాటల విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ సినిమా ప్రతి ఒక్కరిలో సేవా స్ఫూర్తిని రగిలిస్తుంది’ అని అన్నారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. జనవరి చివర్లో మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు..
కుల నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు గొప్ప పోరాటం చేశారు మహిళా విద్య కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారని ఈ సినిమా యూనిట్ ను రేవంత్ రెడ్డి ప్రశంసలతో ముంచెత్తారు. పూలే దంపతుల సామాజిక సేవా గుణం, వారి జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
